కోనోకార్పస్ చెట్లతో పర్యావరణానికి మేలే : వీసీ ఏఆర్ రెడ్డి

కోనోకార్పస్ చెట్లతో పర్యావరణానికి మేలే : వీసీ ఏఆర్  రెడ్డి
  • వాటిని తొలగించడం ఆపాలి
  • జన చైతన్య వేదిక సమావేశంలో వక్తలు
  • వాటి వల్ల ప్రమాదమని శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడి  

హైదరాబాద్​సిటీ, వెలుగు: కోనోకార్పస్​ చెట్ల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఈ చెట్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్ మోహన రావు, యోగి వేమన యూనివర్సిటీ మాజీ వీసీ ఏఆర్  రెడ్డి అన్నారు. వాతావరణంలో ఎక్కువ కార్బన్​డై అక్సైడ్​ను తీసుకొనే మొక్కల్లో ఇవి ముందుంటాయని తెలిపారు. ఏ పరిస్థితుల్లో అయినా నిరంతరం పెరుగుతూ.. వాతావరణంలోని కార్బన్​ డై అక్సైడ్​ను తగ్గిస్తాయన్నారు. వీటి వల్ల ప్రమాదమని, శ్వాసకోశ వ్యాధులు వస్తాయనేది అపోహ మాత్రమేనని పేర్కొన్నారు. 

ఏడాది పాటు ఈ చెట్లపై తాము పరిశోధన చేసి, వీటి రక్షణ కోసం పాటు పాడుతున్నామని తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘కోనోకార్పస్​ చెట్లను రక్షించుకుందాం’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మోహన రావు, ఏఆర్ రెడ్డి హాజరై కోనోకార్పస్ చెట్ల పర్యావరణ ప్రయోజనాలను వివరించారు. ఈ చెట్ల ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని శాస్త్రీయంగా పరిశోధించినట్లు మోహన రావు తెలిపారు. వాటి ఆకుల రసం డయాబెటిస్‌ను కొంత వరకు తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుందని, గొంతు సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా ఇది ఉపయోగపడుతుందని వివరించారు. 

అలాగే, ఈ చెట్లు ఆక్సిజన్‌ను ఎక్కువ మోతాదులో విడుదల చేస్తాయని, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ఏఆర్ రెడ్డి మాట్లాడుతూ.. కోనోకార్పస్ చెట్లు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను 20%  నుంచి -30% అధికంగా తీసుకొనే సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు. ఒక్క చెట్టు 6 వేల కిలోల కార్బన్​ డై యాక్సైడ్​ను  తీసుకొని.. నీరు, ఆక్సిజన్ ను విడుదల చేస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 3.04 ట్రిలియన్ చెట్లు ఉండగా, ఒక్కో వ్యక్తికి సగటున 422 చెట్లు ఉన్నాయన్నారు. కానీ, మన దేశంలో ఈ సంఖ్య కేవలం 28 మాత్రమేనని అన్నారు.  

ఒక మనిషి జీవనానికి సంవత్సరానికి 740 కిలోల ఆక్సిజన్ అవసరమని, దీనికి ఏడు చెట్లు అవసరమవుతాయన్నారు. కాబట్టి, కోనోకార్పస్​చెట్లు లేకుంటే సీఓ2 పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఈ చెట్లను మేకలకు తినిపించినప్పుడు.. వాటి ఆరోగ్యం, పాల ఉత్పత్తి, జీవక్రియలో మెరుగుదల కనిపించిందని తెలిపారు. ఈ చెట్లను హైవేల వెంబడి నాటితే పర్యావరణానికి ఎటువంటి హాని జరగదని, గాలి కాలుష్యాన్ని తగ్గిస్తాయని వివరించారు. 

శాస్త్రీయ పరిశీలన చేయాలి:  జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ రెడ్డి 

కోనోకార్పస్ చెట్లపై విపరీతమైన చెడు ప్రచారం జరిగిందని, ఈ అపోహలను నమ్మిన కొందరు రాజకీయ నాయకులు శాస్త్రీయ పరిశీలన లేకుండా వేల సంఖ్యలో చెట్లను నరికేశారని జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ విషయంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, శాస్త్రీయంగా నిర్ధారించాలన్నారు. వోల్టా చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పర్యావరణవేత్త బయ్యపురెడ్డి, వృక్షశాస్త్ర ప్రొఫెసర్‌‌ బీఎన్‌ రెడ్డి, జీవశాస్త్ర నిపుణులు గోపాలకృష్ణ పాల్గొన్నారు.