కులాల కంటే రాజ్యాంగం గొప్పది

కులాల కంటే రాజ్యాంగం గొప్పది
  • దాన్ని అమలు చేయకుండా ఉత్సవాలా?
  • రెడ్డి జాగృతి సెమినార్​లో వక్తల ప్రశ్న
  • పెరుగుతున్న వివక్షను తగ్గించుకోవాలి
  • ఆస్తుల కంటే విలువలే గొప్పవని పిల్లలకు నేర్పాలని సూచన

హైదరాబాద్, వెలుగు:రాజ్యాంగం ఎంతో గొప్పదని, అది అమలు చేయకుండా ఉత్సవాలు జరిపితే  లాభం లేదని కేంద్ర సమాచార శాఖ మాజీ  కమిషనర్  మాడభూషి శ్రీధర్ అన్నారు. దేశాన్ని నడిపిస్తున్నది మతాధిపతులు, పీఠాధిపతులేమోనని అనిపిస్తున్నదని, కులం, మతం కంటే రాజ్యాంగం గొప్పదని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

ఆదివారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో  “75 ఏండ్ల భారత రాజ్యాంగం – ప్రజలు సాధించిన అభివృద్ధిలో మేధావులు, ప్రజా సంఘాల పాత్ర”  పై రెడ్డి జాగృతి కన్వీనర్ పిట్టా శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు.  ఇందులో పలువురు మేధావులు, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, ప్రజా సంఘాలు నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ.. జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టులు ప్రజలకు ధైర్యం చెప్పాలని, లేకపోతే ఎలా బతుకుతారని ఆయన ప్రశ్నించారు. మన దేశంలో ఎన్నికల బాండ్లు పెద్ద సమస్యగా మారాయని, వీటిని సుప్రీంకోర్టు అంగీకరించలేదని శ్రీధర్ గుర్తు చేశారు. బాండ్ల ద్వారా అన్ని పార్టీలకు రూ. 42 వేల కోట్లు వచ్చాయని, వీటిని ప్రజలకు పంచి ఓట్లు కొనుగోలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

మానవ సంబంధాలను కాపాడుకోవాలి: హరగోపాల్​

మానవ సంబంధాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.  పెరుగుతున్న వివక్షను తగ్గించుకొని, ఆస్తుల కన్నా విలువలే గొప్పవని పిల్లలకు నేర్పించాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు.  రామానుజ స్వామి వెయ్యేండ్ల క్రితమే మనుషులంతా సమానమేనని చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ అన్నారు.  మన కులం పై ఇష్టం ఉన్నా ఇతర కులాల మీద ద్వేషం ఉండొద్దని, అలా ఉంటే సమాజం అంగీకరించబోదని చెప్పారు. 

కులాల కంటే రాజ్యాంగం గొప్పదని, దానిని సరిగ్గా అమలు చేయాలని చూస్తున్న రెడ్డి జాగృతిని అభినందిస్తున్నానని అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ  ఘంటా చక్రపాణి అన్నారు. ఇలాంటి సదస్సులు గ్రామాల్లోనూ నిర్వహించాలని సూచించారు.  మంద కృష్ణ మాదిగ తదితరులు మాట్లాడారు.