వరుసగా నాలుగేండ్లు నివసిస్తే స్థానికులే..

వరుసగా నాలుగేండ్లు నివసిస్తే స్థానికులే..
  • స్థానిక కోటా సీట్లకు అర్హులే

  • కాళోజీ మెడికల్​ వర్సిటీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో వరుసగా నాలుగేండ్లు నివసించి, నీట్ అర్హత పరీక్ష రాసినట్లయితే మెడికల్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్లలో స్థానిక కోటా కింద పరిగణించాలంటూ కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి తెలంగాణలో ఉంటూ ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌ ఉత్తీర్ణత సాధించినా స్థానిక కోటా కింద పరిగణించకపోవడాన్ని సవాలు చేస్తూ స్టూడెంట్​అనమ్తా ఫరూక్‌‌‌‌‌‌‌‌  హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఆలోక్‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌ జె.శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ పదో తరగతి వరకు దుబాయ్‌‌‌‌‌‌‌‌లో చదువుకుని, 2019లో తెలంగాణకు వచ్చి ఇక్కడే ఇంటర్మీడియెట్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేశారన్నారు. నాలుగేండ్ల స్థానిక నివాసానికి సంబంధించి శేరిలింగంపల్లి ఎమ్మార్వో జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రాన్ని అందజేశామన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ 4 ఏండ్లు తెలంగాణలో నివసించారని మెడికల్‌‌‌‌‌‌‌‌ అడ్మిషన్లలో స్థానిక కోటా కింద పరిగణించాలని ఆదేశించింది.