కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో లొల్లి

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో లొల్లి
  • కాంట్రాక్టర్లు, ఇంజినీర్ మధ్య బిల్లుల వివాదాలు 
  • ఇంజినీర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్లు
  • తనను దూషించారని, కుర్చీలో నుంచి తోసేశారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన ఈఈ 
  • వెలుగు చూస్తున్న అక్రమాలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టర్లకు ఓ ఇంజినీర్ కు మధ్య ముదిరిన బిల్లుల లొల్లి కేసుల వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరువర్గాల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 19న వరాల నారాయణ అనే కాంట్రాక్టర్ తనను కులం పేరుతో దూషించాడని, కుర్చీలో ఉన్న తనను తోసేశాడని బల్దియా ఈఈ రొడ్డ యాదగిరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ పిటిషన్ పై పోలీసులు విచారణ ప్రారంభించడంతో.. అప్రమత్తమైన కాంట్రాక్టర్లు సదరు ఈఈపై పలు అవినీతి ఆరోపణలు చేస్తూ శుక్రవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంజనీర్ తో కాంట్రాక్టర్ల వివాదం మరింత ముదిరింది.

డిజైన్లకు విరుద్ధంగా కాంట్రాక్టర్ల పనులు.. 

ఎంపీ ల్యాడ్స్ కింద ఓ కమ్యూనిటీ బిల్డింగ్ కోసం రూ.15 లక్షలు నిధులు మంజూరయ్యాయి.  ఆ నిధులతో 7 పిల్లర్లపైన భవనం  నిర్మించాల్సి ఉంది. అయితే 7  పిల్లర్లకు  బదులు 18 పిల్లర్లు వేశారు. దీంతో నిర్మాణ వ్యయం పెరిగే అవకాశముందని, ఇలా డిజైన్ కు విరుద్ధంగా పనులు చేసి సదరు కాంట్రాక్టర్ ఒత్తిడి చేస్తున్నారని ఈఈ యాదగిరి వాదిస్తున్నారు. బతుకమ్మ, దసరా నిమజ్జనంలో భాగంగా రోడ్ల  మరమ్మతు కోసం పలు పనులు మంజూరయ్యాయి.  ఒక్కో  డివిజన్‌‌‌‌‌‌‌‌లో  రెండు  ట్రిప్పుల మొరం పోసి, 30 వేల చొప్పున బిల్లులు ఇవ్వాలని సదరు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది.  ఆవుల మధుకర్ అనే కాంట్రాక్టర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్  ఎదుట చొక్కారావు జంక్షన్ పనుల్లో డిజైన్ కు వ్యతిరేకంగా పనులు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ క్రమంలో డిజైన్ ప్రకారం పనులు చేస్తేనే బిల్లులు  ఇస్తాననేది ఈఈ యాదగిరి వాదన.  ఈ మూడు పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ నెల 19న తన  ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చారని, అందులో వరాల నారాయణ అనే కాంట్రాక్టర్ తనను దుర్భాషలాడడంతోపాటు నెట్టేశాడని ఈఈ యాదగిరి ఆరోపిస్తున్నారు.  సదరు  వ్యక్తిపై టౌన్  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే శుక్రవారం కక్షపూరితంగా తనపై కాంట్రాక్టర్లంతా కలిసి కలెక్టర్ కు  ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. 

బినామీలతో ఈఈ యాదగిరి పనులు 

బల్డియా ఈఈ యాదగిరి బినామీలతో  పనులు చేపడుతూ తనవాళ్ల బిల్లులు ఎప్పటికప్పుడు పాస్ చేయిస్తున్నారని కరీంనగర్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.  తన కుమారుడు రొడ్డ భరద్వాజ్(రిజిస్టర్డ్ కాంట్రాక్టర్)కు బల్దియాలోని ముఖ్యమైన పనులు వచ్చే విధంగా(రిజర్వేషన్) చక్రం తిప్పుతారని, అంతేగాక పోటీకి వచ్చే ఇతర కాంట్రాక్టర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ, దుర్భాషలాతుడున్నారనే ఆరోపణలు ఈఈపై ఉన్నాయి.  టెండర్ ఐడీలో రూ. 40 లక్షల విలువైన పనులు  యాదగిరి దక్కించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. 

బల్దియాలో అవినీతిపై విచారణ జరపాలి

బల్దియాలో కాంట్రాక్టర్లు డిజైన్లకు విరుద్ధంగా పనులు చేపట్టడం, అధికారులు నిధులు విడుదల చేయడంపై సమగ్ర విచారణ జరిపించాలి. బినామీల పేరుతో ఇంజినీర్లు పనులు చేయించడం సరికాదు.  ఈఈ యాదగిరి, కాంట్రాక్టర్ల వ్యవహారంపై ప్రత్యేకాధికారితో విచారణ జరిపించి.. వాస్తవాలేంటో తేల్చి దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. –  మహమ్మద్ అమీర్, సామాజిక కార్యకర్త