దేశ ప్రజలపై కేంద్రం బాదుడు.. గ్యాస్‌ ధరలు పెంపు.. ఎల్పీజీ సిలిండర్‌పై 50 రూపాయలు పెరిగింది

దేశ ప్రజలపై కేంద్రం బాదుడు.. గ్యాస్‌ ధరలు పెంపు.. ఎల్పీజీ సిలిండర్‌పై 50 రూపాయలు పెరిగింది

న్యూఢిల్లీ: దేశ ప్రజలంతా శ్రీరామ నవమి పండుగను జరుపుకున్న మరుసటి రోజే సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. నాన్-ఉజ్వలతో పాటు ప్రధాన్ మంత్రి ఉజ్వల లబ్ధిదారులు పొందుతున్న ఎల్పీజీ సిలిండర్లపై కూడా 50 రూపాయలు పెంచుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై పెంచిన ధరలు రేపు ఉదయం నుంచి.. అంటే ఏప్రిల్ 8, 2025 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ 803 రూపాయల నుంచి 853 రూపాయలకు పెరగనుంది. ఉజ్వల పథకం కింద ఇస్తున్న14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 503 నుంచి 553 రూపాయలకు పెరుగుతుంది. ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధరల సవరింపు ఉంటుందని గతంలో ప్రకటించిన కంపెనీలు.. ఆగస్టు 2024  నుంచి ధరలు పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:-లీటర్ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ 2 రూపాయలు పెంపు..

లీటర్ పెట్రోల్ ధర సుమారు 110 రూపాయలకు చేరుకోవడంతో వాహనదారులు భారాన్ని మోస్తున్నారు. నిత్యావసరాలు పెరుగుదల, ద్రవ్యోల్పణం, ఆర్థిక సంక్షోభం కారణంగా దేశ ప్రజలు సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ధరలు కూడా పెరగడంతో మధ్యతరగతి వాళ్లు బతకడమే కష్టంగా మారిందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.