హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగైదు రోజుల నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. నల్గొండ, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రోజూ వందకు పైగా కేసులు వస్తున్నాయి. వరంగల్ అర్బన్, సూర్యాపేట, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 70 నుంచి 100 కేసులు రికార్డవుతున్నాయి. ఇటీవలే ఆయా జిల్లాలకు హెల్త్ ఆఫీసర్లు వెళ్లి రివ్యూ చేశారు. కేబినేట్ మీటింగ్‌లోనూ ఆయా జిల్లాల్లో పరిస్థితిపై చర్చించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఫీవర్ సర్వే చేయాలని సీఎం ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది. 7 జిల్లాల్లో 3 శాతానికి పైగా నమోదవుతోంది. ఖమ్మంలో టెస్టులు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో నలుగురికి పాజిటివ్ వస్తోంది. అక్కడ గత నాలుగు రోజుల్లోనే 1,187 కేసులు నమోదయ్యాయి.
గాంధీలో 401 మంది పేషెంట్లు..
ఆస్పత్రుల్లోనూ కరోనా పేషెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మే మూడో వారం నుంచి తగ్గుతూ వచ్చిన ఇన్ పేషెంట్ల సంఖ్య, నాలుగైదు రోజుల నుంచి ఎక్కువవుతోంది. గాంధీ హాస్పిటల్‌కు ఇంతకుముందు రోజూ 30 నుంచి 40 కేసులు వస్తే, ఇప్పుడు 40 నుంచి 50 మధ్యలో వస్తున్నాయి. బుధవారం 46 మంది, గురువారం 21 మంది అడ్మిట్ అయ్యారు. వారం క్రితం 390 ఉన్న ఇన్ పేషెంట్ల సంఖ్య, ఇప్పుడు 401కి చేరింది. ఖమ్మం, సూర్యాపేట, గ్రేటర్ హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచే ఎక్కువ మంది వస్తున్నారని గాంధీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. చాలా హాస్పిటళ్లలో కేసుల సంఖ్య స్పల్పంగా పెరుగుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న కేసుల్లో వర్కింగ్ ఏజ్ గ్రూపు వాళ్లు ఎక్కువగా ఉంటున్నారని, వారం లోపలే కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నారని పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వాళ్లతో పోలిస్తే, తీసుకున్న వాళ్లలో సివియారిటీ చాలా తక్కువగా ఉంటోందని అపోలో హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. తమ దగ్గర కూడా కేసులు పెరిగాయని, ప్రస్తుతం 71 మంది పేషెంట్లు ఉన్నారని నిజామాబాద్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ తెలిపారు.
థర్డ్ వేవా? కాదా?
ప్రస్తుతం కేసులు పెరగడానికి థర్డ్ వేవ్ కారణమా? కాదా? అనే దానిపై డాక్టర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్‌లాక్‌తో జనాల మూవ్‌మెంట్ పెరగడంతో పాటు సభలు, సమావేశాల వల్ల కేసులు పెరిగాయని.. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ తగ్గే అవకాశం ఉందని కొంతమంది చెబుతున్నారు. ఇది థర్డ్ వేవ్‌కు సూచన అని మరికొంత మంది అంటున్నారు. థర్డ్ వేవా? కాదా? అనేది ఒకట్రెండు వారాల్లో స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.
నిర్లక్ష్యం చేస్తే మరో వేవ్!
థర్డ్ వేవ్ రావడం, రాకపోవడం జనాల చేతుల్లోనే ఉంది. ఫస్ట్ వేవ్ తర్వాత చేసిన పొరపాట్లే మళ్లీ ఇప్పుడు చేస్తున్నారు. మాస్క్, సోషల్ డిస్టెన్స్ రూల్స్ పాటించడం లేదు. సభలు, సమావేశాలు, పార్టీలు, ఫంక్షన్లకు వెళ్తున్నారు. వీటివల్ల ఇప్పటికే కొన్ని చోట్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దాని ప్రభావమే హాస్పిటళ్లలోనూ కనిపిస్తోంది. ఇప్పటికైనా జనాలు అప్రమత్తంగా ఉండకపోతే వైరస్ మళ్లీ విస్తరించి, ఇంకో వేవ్ వచ్చే అవకాశం ఉంది.
- డాక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్