కర్నూలు: భూ కైలాస క్షేత్రం శ్రీశైలంలో కరోనా విజృంభిస్తోంది. కేవలం 3 రోజుల వ్యవధిలో 62 మంది ఆలయ సిబ్బంది కరోనా బారినపడ్డారు. శ్రీగిరులతోపాటు చుట్టుపక్కల ఉన్న సున్నిపెంట తదితర ప్రాంతాల్లో కలిపి ఆదివారం వరకు మొత్తం 545 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఉగాది వేడుకల సందర్భంగా కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు శ్రీశైల ఆలయాన్ని భారీ సంఖ్యలో దర్శించుకుని వెళ్లారు. వేలాది మంది పాదయాత్రగా శ్రీశైలానికి రాగా మిగిలిన వారు వాహనాలు, బస్సుల్లో శ్రీశైలం క్షేత్రానికి వచ్చి ఉగాది వేడుకల్లో మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉగాది ముందు వరకు ఒక్క కరోనా కేసు లేని పరిస్థితి ఉండగా..తర్వాత సీన్ మారిపోయింది. నల్లమల అడవిలో కృష్ణా నది తీరాన.. రెండు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న శ్రీశైల క్షేత్రంలో కరోనా విజృంభిస్తుండడంతో భక్తుల రాకపోకలను నియంత్రిస్తున్నారు.
ఆంక్షలు కఠినతరం చేస్తున్న అధికారులు
కరోనా ప్రబలిన నేపథ్యంలో ఆంక్షలు కఠినతరం చేశారు దేవస్థానం అధికారులు. శ్రీశైలంలో కరోనా కేసు నమోదు కాకముందే అన్నదాన కేంద్రంలో సామూహిక సహపంక్తి భోజనాలు రద్దు చేసి సామాజిక దూరం పాటించే చర్యలు ప్రారంభించారు. ఆలయం మొత్తం ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయిస్తూ.. భక్తులను పరిమితంగానే అనుమతిస్తున్నారు. దుకాణాల వద్ద కూడా సామాజిక దూరం పాటించేలా ఎప్పటికప్పుడు తనిఖీలు చేశారు. అయితే ఆలయ పూజారి ఒకరు కరోనా బారిన పడి మృతి చెందడంతో వెంటనే 144 సెక్షన్ విధించారు. దుకాణాలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకే అనుమతిస్తున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా మొక్కుబడుల కోసం వచ్చే భక్తులను నిరాశకు గురిచేయకుండా కరోనా పరీక్షలు చేయించుకుని నెగటివ్ రిపోర్టు ఉన్న వారికే దర్శనాలకు అనుమతిస్తున్నారు. కనీసం 72 గంటల ముందు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్న వారికే శ్రీశైలంలో దర్శనాలకు అనుమతిస్తున్నారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని.. కరోనా కట్టడి చర్యలను స్వచ్ఛందంగా పాటించాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే లాక్డౌన్ ప్రకటించేందుకు వెనుకాడబోమని దేవస్థానం ఈవో కేఎస్ రామారావు హెచ్చరికలు జారీ చేశారు.