సంక్షోభ సమయంలో ఇన్ని కుట్రలా?

సంక్షోభ సమయంలో ఇన్ని కుట్రలా?

విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునేదే హిందూత్వం. ఇంతటి విశాల హృదయులైన హిందువులకు, తమకు తామే మేధావులమనే భుజకీర్తులు తగిలించుకుని పోజులు కొట్టే కొందరు.. సెక్యులరిజం పేరుతో కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం  వారు చరిత్రను కూడా వక్రీకరించారు. హిందువుల్లో విషబీజాలు నాటుతూ వారి ఘనమైన చరిత్రను మరిచిపోయేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా సమాజంలోని కీలక రంగాలు.. ముఖ్యంగా మీడియాలో చేరి 
సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. 


బీజేపీపై మతతత్వ ముద్ర వేయడంతోపాటు ప్రధాని నరేంద్రమోడీ అన్ని విధాలా విఫలమయ్యారంటూ కొన్ని దుష్టశక్తులు కలిసి కుట్రలకు తెరతీశాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత నుంచి వీటి ఆటలు సాగకపోవడమే ఈ కసి, ద్వేషాలకు కారణం. రోజురోజుకూ దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ శక్తిమంతంగా తయారు కావడం, ప్రజలంతా ఈ సంస్థల నేతృత్వంలో ఏకీకృతం అవుతుండడం వీటిని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సంస్థలు ఏది చెప్పినా హిందూ మతతత్వం, అదే విషయాన్ని వారు చెబితే సెక్యులరిజం. ఇందుకు ఉదాహరణే ఇటీవల జరిగిన ఎన్నికలు. ముఖ్యంగా బెంగాల్ దీదీ జై కాళీ మాత అంటే సెక్యులరిజం, అదే బీజేపీ శ్రీరామ్ అంటే హిందూ మతతత్వంగా దుష్ప్రచారం చేశారు. తమిళనాడులో కరడుగట్టిన హేతువాద(నాస్తికవాద) డీఎంకే పార్టీ నేత స్టాలిన్ తాను హిందువునేనని, తమ కుటుంబీకులు పూజలు చేస్తారని అంటే ఆయన సెక్యులరిస్టు. అదే బీజేపీ నాయకులు హిందూత్వం గురించి, దేవాలయాల అభివృద్ధి గురించి మాట్లాడితే మతతత్వవాదులని ముద్ర. సెక్యులరిస్టును అనడం ఒక ఫాషన్​గా ఈ దేశంలో పరిస్థితి మారిపోయేలా చేస్తున్నారు. 

అన్నింటికీ హిందూ పండుగలే కారణమా?

హిందువుల పండుగలు, ఉత్సవాలను ఏదో కారణంతో జరగకుండా చూడాలి, ఇతర మతస్తుల పండుగలు, ఉత్సవాలకు సానుకూల ప్రచారం కల్పించాలి. ఇందులో భాగంగానే కరోనాకు కుంభమేళాయే కారణమన్నట్లు దుష్ప్రచారం, అదే ఈద్ లాంటి పండుగల సమయాల్లో జనంతో కిటకిటలాడుతున్న మార్కెట్లు వారికిపట్టవు. కుంభమేళాతో కరోనా వ్యాప్తి నిజమైతే, ఈద్ సందర్భంగా కిటకిటలాడిన మార్కెట్లతో కూడా కరోనా వ్యాప్తి నిజం కావాలి కదా? అలాగే వినాయకసాగర్(హుస్సేన్ సాగర్)లో ఏడాది పొడుగునా పరిశ్రమల నుంచి వచ్చే విషపదార్థాలు కలిస్తే కలుషితం కాదు కానీ, అదే ఏడాది కొకసారి వినాయక నిమజ్జనం జరిపితే మాత్రం మొత్తం కాలుష్య కాసారంగా మారిపోయినట్లు నానా హడావుడి. దేవాలయాల్లో పూజలు చేసే పూజారులకు జీతాలివ్వాలంటే నిధులుండవు కానీ మౌల్వీలకు, పాస్టర్లకు వేలాది రూపాయల జీతాలు, పారితోషికాలు ప్రజల సొమ్ము నుంచి విడుదలవుతాయి. దేవాలయాలతోపాటు వాటి ఆస్తులు, ఆదాయాలన్నీ ప్రభుత్వ అధీనంలో ఉండాలి కానీ, చర్చిలు, మసీదులు ప్రభుత్వాల అధీనంలో ఉండవు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తే హిందూ మతతత్వవాది అనే ముద్ర వేసేస్తూ, మైనార్టీలకు ప్రత్యేక హక్కులంటూ ఈ సొ-కాల్డ్ సెక్యులరిస్టులు భాష్యం చెబుతారు. అందుకే కాబోలు ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ‘ఇండియాలో సెక్యులరిజం అంటే హిందువులను కించపరుస్తూ, నిర్లక్ష్యానికి గురిచేస్తూ మైనార్టీల సంక్షేమం పేరుతో ఒక వర్గం వారిని బుజ్జగించడం’ అని కామెంట్ చేశారు. 

ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం

దేశంలో కరోనా పరిస్థితుల విషయానికి వస్తే మోడీ విఫలమయ్యారంటూ అబద్దపు ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు తదితర ప్రతిపక్షాల నాయకులు ఈ సంక్షోభ నియంత్రణకు చేసిన ప్రయత్నం ఏంటి? కనీసం ఒక్క ఆస్పత్రినైనా సందర్శించి రోగులకు ధైర్యం చెప్పారా? ఆస్పత్రుల్లో సౌకర్యాలపై ఆరా తీశారా? అదే వీరంతా నిత్యం దుమ్మెత్తిపోసే ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా కరోనా నివారణకు కృషి చేస్తున్నాయి. విద్యాభారతి లాంటి సంస్థలు తమ శిశుమందిరాల భవనాలన్నీ కరోనా ఐసోలేషన్, చికిత్సా కేంద్రాలుగా మార్చి ఉచిత సేవలందిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ నిత్యం కరోనా రోగులున్న ఆస్పత్రులను సందర్శిస్తూ.. తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకొని ప్రజల్లో విశ్వాసం పెరిగేలా చేశారు. ఇప్పటి దాకా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు తమకు చెందిన ఒక్క భవనాన్నయినా కరోనా సెంటర్లుగా మార్చి రోగులకు చికిత్స చేయిస్తున్నాయా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ఏడెనిమిదిసార్లు గాంధీ ఆస్పత్రి సందర్శించి అక్కడి సౌకర్యాల మెరుగుకు కృషి చేశారు. ఇతర ఆస్పత్రుల్లో పరిస్థితులపై కూడా సమీక్షిస్తూ పీఎం కేర్స్, కేంద్రం నిధులను మంజూరు చేయిస్తున్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రితోపాటు వరంగల్ ఎంజిఎం లాంటి ఆస్పత్రులను సందర్శిస్తూ రోగుల బాధలు తెలుసుకున్నారు. ఇదీ నాయకులు చేయాల్సిన పని. 
 

ప్రభుత్వాలకు సహకరించాలి

రాష్ట్రంలోని అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ఒక్క ఆస్పత్రిని సందర్శించిన దాఖలాలు లేవు. లేక లేక సీఎం ఫామ్​హౌస్ నుంచి బయటకు రావడమే రాష్ట్రంలో ఒక పెద్ద సంచలనమైంది. సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రి సందర్శనతో మీడియాకు పెద్ద పండుగలా  మారింది. తర్వాత ఆయన వరంగల్లోని ఎంజీఎంను సందర్శించడం, అనంతరం అక్కడి జైలులో ఉన్న వారిని పలకరించడం సంతోషించదగ్గ విషయమైనా సౌకర్యాల కల్పనకు తీసుకోబోతున్న చర్యలేంటో చెప్పకపోవడంతో ఆయన పర్యటనకు ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే జూడాలు సమ్మెకు దిగడం ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా సోకాల్డ్ సెక్యులరిస్టులు, ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు చేయకుండా దేశం ఎదుర్కొంటున్నఈ సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరిస్తూ ప్రజలు కరోనా బారి నుంచి బయట పడేలా ధైర్యం కల్పిస్తారని ఆశిద్దాం.

సంక్షోభంలో ఉంటే మద్దతుగా నిలుస్తరు

ఏ దేశమైనా సంక్షోభంలో ఉంటే ఆ దేశంలోని ప్రజలు, ప్రతిపక్షాలన్నీ ఏకమై తమ దేశాన్ని ఆ సంక్షోభం నుంచి ఎలా బయట పడేయాలనే ఆలోచన చేస్తాయి. ఇటీవల బాంబుల వర్షం కురిపించి ఇజ్రాయిల్ ని నామరూపాలు లేకుండా చేయాలనుకుంటే ఆ దేశం ఎలా ఎదుర్కొని పాలస్తీనా, హమాస్ లే తోకముడిచేలా చేసిందో చూశాం. దీనికి కారణం ఆ దేశ ప్రజల్లో ఉన్న జాతీయ భావం. ముఖ్యంగా ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నేతన్యాహూకు కాబోయే ప్రధాని బెన్నీ గాన్జ్ పూర్తిగా సహకరించి తమ దేశం సంక్షోభం నుంచి బయట పడేలా చేశారు. అందుకే చుట్టూ పదుల సంఖ్యలో శత్రు దేశాలున్నా అతి చిన్న దేశమైన ఇజ్రాయిల్ మనగలుగుతుంది. అదే మన దేశంలో అయితే డోక్లాం సమస్య రూపుమాపేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రతిపక్ష పార్టీ నాయకుడు శత్రు దేశం రాయబారితో రహస్య మంతనాలు చేస్తారు. మన దేశం చైనా వైరస్ తో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే ప్రభుత్వానికి సహకరించాల్సిందిపోయి బొక్కలు వెతికే ప్రయత్నం చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ అనుకూల, లెఫ్ట్ భావజాల జర్నలిస్టులు, మీడియా సంస్థలు. అంతర్జాతీయంగా ఇండియా ప్రతిష్ట తీసేలా అభూతకల్పనలతో వార్తలు ప్రచురిస్తూ, టీవీల్లో డిబేట్లు, వార్తా కథనాలు వండి వారుస్తున్నారు. అందుకేనేమో అంతర్జాతీయ మీడియా వీరి వైఖరిని దుయ్యబడుతూ ఇండియా మీడియాను “రాబందుల మీడియా”గా దుయ్యబట్టినట్లుంది. 

ఇండియా పరువు తీస్తున్నారు

ఢిల్లీలో ఆక్సిజన్ బ్లాక్ చేశారు. బెంగళూరులో బెడ్స్ బ్లాక్ చేశారు. జార్ఖండ్ లో వ్యాక్సిన్ బ్లాక్ చేశారు. పంజాబ్ లో 2 లక్షల  రెమిడిసివీర్ ఇంజెక్షన్లు నదిలో వేసేశారు. యూపీలో పాతిపెట్టిన శవాలను తీసి నదిలో వేసి కరోనా మృతులుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసి అరెస్ట్ అయ్యారు. కుంభమేళాను కరోనా సూపర్ స్ప్రెడర్ గా ప్రచారం చేసి బోర్లా పడ్డారు. చైనా వైరస్ను భారత్ వేరియంట్గా దుష్ప్రచారం చేసి ప్రపంచ దేశాల్లో భారత్ పరువు తీశారు. అయినా ఏం సాధించారు? మోడీకి, కేంద్రానికి చెడ్డ పేరు తేగలిగారా? వీళ్లు సక్సెస్ అయితే ఫ్రాన్స్ ప్రధాని మెక్రాన్ “ఇండియాకు కరోనా నివారణ విషయంలో ఎవరూ లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఇండియన్ లీడర్షిప్కు ఉంది” అని విశ్వాసాన్ని ఎందుకు వ్యక్తం చేస్తారు. యూరప్, అమెరికాలోని 87 దేశాల్లో ఇప్పటిదాకా 8.27 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ దేశాల్లో మొత్తం జనాభా 134 కోట్లు. కరోనాకు 18.71 లక్షల మంది బలయ్యారు. కానీ, 135 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో 2.27 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా, 2.46 లక్షల మంది వైరస్​తో చనిపోయారు. మోడీ ప్రభుత్వం చైనా వైరస్ నివారణలో ఈ దేశాల కంటే ఎలా విఫలమైందో ప్రతిపక్షాలకే తెలియాలి.
అన్ని చర్యలు చేపడుతున్న కేంద్రం

వాస్తవానికి ప్రజారోగ్యం అనేది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. సౌకర్యాలు కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కరోనా నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నా కేంద్రం వాటి వైఫల్యాలను ఎత్తిచూపి రాజకీయాలు చేయకుండా తన వంతుగా కృషి చేస్తోంది. కానీ ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వాలు తమ వైఫ్యల్యాలను కేంద్రంపైకి తోసేసి మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీని ప్రజల్లో చులకన చేసేందుకు చూస్తున్నాయి. 60 ఏండ్లకు పైగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ప్రస్తుత దేశ పరిస్థితులకు తామే కారణమని, కనీసం ఒక్క పీపీఈ కిట్ కూడా తయారు చేయలేని వైద్య రంగం దుస్థితికి సిగ్గు పడాల్సింది పోయి.. ఆ పార్టీ నేత రాహుల్.. ఏడేండ్ల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన మోడీనే ఇందుకు కారణమైనట్లు ఆరోపిస్తున్నారు. అందుకే ప్రజలు మోడీ పిలుపునిచ్చిన కాంగ్రెస్ ముక్త భారత్ కు అనుకూలంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ కు తోడు కమ్యూనిస్టులు జత కలిశారు. సీపీఎం, సీపీఐలను ప్రజలు ఛీ కొడుతున్నా వారి వైఖరుల్లో మార్పు రావట్లేదు. చైనా సృష్టించిన కరోనా వైరస్ ను చైనా వైరస్ అంటే తెగ బాధపడిపోతూ అలా అనకూడదంటూ నీతులు చెబుతూ, కరోనా రెండో స్ట్రెయిన్ ను మాత్రం ఇండియన్ వేరియంట్ అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. దీనిని బట్టి వీరిని ఏ దేశ భక్తులనాలో ప్రజలే నిర్ణయించాలి.                                                                   - శ్యాంసుందర్  వరయోగి, కో-కన్వీనర్, బీజేపీ రాష్ట్ర  ప్రశిక్షణ కమిటీ