కొర్రమీను@600 .. చెరువులు ఎండిపోవడంతో మార్కెట్​లో చేపల కొరత

కొర్రమీను@600 .. చెరువులు ఎండిపోవడంతో మార్కెట్​లో చేపల కొరత
  • చిన్న చేపలకు పెరిగిన డిమాండ్​
  • రవ్వ, బొచ్చ రకాలకు కేజీ రూ.200
  • కోల్​కత్తా మార్కెట్ కు ఎగుమతులు బంద్
  • హైదరాబాద్, ఏపీ నుంచి చేపలు దిగుమతి 

నల్గొండ, వెలుగు : నాన్​వెజ్ ప్రియులు బాగా ఇష్టపడే కొర్రమీను చేపలకు మార్కెట్​లో డిమాండ్ పెరిగింది. చెరువులు ఎండిపోవడంతో మార్కెట్​లో చేపలకు కరువొచ్చింది. దీంతో హైదరాబాద్, ఏపీ నుంచి చేపలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. నల్గొండలో నిత్యం రద్దీగా కనిపించే పానగల్లు, ప్రకాశం బజార్​మార్కెట్లు వెలవెలబోతున్నాయి.

నల్గొండ జిల్లాలోని చుట్టుపక్కల చెరువులన్నీ ఎండిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి చేపలను తీసుకొచ్చి అమ్ముతున్నారు. దీంతో రేట్లు భారీగా పెరిగాయి. కొర్రమీను కేజీ రూ.600 కాగా, రవ్వ, బొచ్చ చేపలు కేజీ రూ.200 దాటింది. మార్కెట్​లో రూ.100కే దొరికే జల్లలు, రామ చందమామలు, పరకలు ధరలు ఏకంగా రూ.200కు పెంచారు. రవ్వ, బొచ్చ దొరక్క పోవడంతో జల్లలు, పరకలకు డిమాండ్ పెరిగింది. 

బిజినెస్ ​పడిపోయింది..

గత నెల రోజుల నుంచి చేపల మార్కెట్​లో బిజినెస్ భారీగా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం వస్తే రూ.లక్ష జరిగే వ్యాపారం ఇప్పుడు రూ.30, 40 వేలకు మించడం లేదు. రూ.30, 40 వేలు అమ్మే చిన్న, చితకా వ్యాపారులు మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సండే రోజు రూ.5, 6 వేలకు మించి వ్యాపారం జరగడం లేదు. రవ్వలు, బొచ్చలు మార్కెట్​లోకి రాక రెండు వారాలు దాటింది. హైదరాబాద్, ఆంధ్రా నుంచి చేపలు దిగుమతి చేసుకోవాల్సి రావడంతో రేటు గిట్టుబాటు కావట్లేదు. దీంతో గత్యంతరం లేక రేట్లు పెంచాల్సి వస్తోందని పానగల్లు చేపల వ్యాపారి శంకర్​ 'వెలుగు'తో చెప్పారు. 

కోల్ కత్తా బిజినెస్​ బంద్​.. 

లోకల్​అవసరాలకు సైతం చేపలు దొరక్క పోవడంతో కోల్​కత్తాకు ఎగుమతులు కూడా బంద్ చేశారు. ప్రతి వారం జిల్లా కేంద్రం నుంచి నాలుగైదు టన్నుల చేపలు కోల్​కత్తాకు ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతులతో ప్రతి వారం నల్గొండలోనే రూ.10 లక్షల బిజినెస్​ నడుస్తుంది. రెస్టారెంట్లు, బార్​అండ్ రెస్టారెంట్లలో లభించే అపోల్​ ఫిష్​ కూడా దొరకడం లేదు. టైగర్ రొయ్యలు మాత్రం వస్తున్నాయి.    

ఎండిపోయిన చెరువులు..

నల్గొండ జిల్లాలోని జీయెడవల్లి, కనగల్, మిర్యాలగూడ చెరువుల నుంచి భారీగా చేపలు వచ్చేవి. నాగార్జున సాగర్​రిజర్వాయర్​లో నీటిమట్టం అడుగంటిపోవడంతో దాని దిగువన ఉండే ఏఎమ్మార్పీ పరిధిలోని చెరువులు నీళ్లు లేక నెర్రలు బారాయి. నాగార్జునసాగర్​ఆయకట్టు ప్రాంతంలోని కోదాడ, హుజూర్​నగర్​లో అక్కడకక్కడ మాత్రమే చెరువుల్లో నీళ్లు కనిస్తున్నాయి. హైదరాబాద్, ఆంధ్రా, కోదాడ, హుజూర్​నగర్​నుంచే నల్గొండకు చేపలు తెచ్చుకోవాల్సి వస్తోంది.