కేసీఆర్.. 4 కోట్ల మంది హీరో అయితే ఎందుకు ఓడిపోయిండు?

కేసీఆర్.. 4 కోట్ల మంది హీరో అయితే ఎందుకు ఓడిపోయిండు?
  • ప్రజలు తిరస్కరించిన సంగతి గుర్తుంచుకోవాలి: మండలి చైర్మన్ గుత్తా 
  • ఏపీఎల్, బీపీఎల్ కార్డ్స్ వేర్వేరుగా ఇవ్వాలని సీఎం రేవంత్​కు లేఖ

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ 4 కోట్ల మంది హీరో అని కేటీఆర్ అంటున్నారని, అదే నిజమైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎలా ఓడిపోతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. 4 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ కు, బీఆర్ఎస్​కు ఓటు వేయకుండా తిరస్కరించారనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. అందుకు కారణాలేదంటో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. శాసన మండలిలో ఆయన మంగళవారం మీడియాతో చిట్ చాట్ చేశారు.

ప్రతిపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కుల గణన సర్వే లెక్కలపై  విమర్శలు చేస్తున్నాయని, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కులాలవారీ లెక్కలు తీసిన కాంగ్రెస్​ సర్కారును  అభినందించాలన్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలని.. ఒకే విషయంపై అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడటం మంచిది కాదన్నారు.

గత పదేండ్లుగా కొత్త రేషన్ కార్డ్స్ కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డ్ లు ఇస్తున్నదన్నారు. అయితే ఆయా కుటుంబాల ఆర్థిక స్థోమత ప్రకారం ఏపీఎల్, బీపీఎల్ కార్డ్స్ వేర్వేరుగా ఇవ్వాలని తాను సీఎం రేవంత్ కు లేఖ రాశానని, దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. 

టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతున్నాయన్నారు. కేవలం 25 వేల ఓట్లకు సంబంధించిన ఎన్నిక కోసం రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అమలు చేయడం వల్ల నష్టం జరుగుతోందని, ఈ  కోడ్ ను సవరించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశానని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు ప్రకటనపై తాను  మాట్లాడనని, రాజకీయ లబ్ధి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారన్నారు. 

కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఎవరు మాట్లాడినా తప్పేనని, బీసీలు, అగ్రకులాల మధ్య విద్వేషాలు పెంచేలా మాట్లాడం  కరెక్ట్ కాదన్నారు. కేవలం ఒక కులం వారి ఓట్లతో ఎన్నికల్లో గెలుస్తం అనుకుంటే తప్పన్నారు. జమిలి ఎన్నికలు వస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు.