మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. 2024, నవంబర్ 23వ తేదీ ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఉదయం 8.30 నుంచి ఈవీఎంల ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా..ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించింది ఈసీ.
మహారాష్ట్ర ఎన్నికల వివరాలు:
మహారాష్ట్రలో గెలుపుపై ఎన్డీఏ, ఇండియా కూటములు ధీమాతో ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా కుల గణన, రిజర్వేషన్లు, రైతుల పంటలకు మద్దతు ధర, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు నిలువగా.. జార్ఖండ్ ఎన్నికల్లో అక్రమ చొరబాట్లు, రిజర్వేషన్లు, జేఎంఎం అవినీతి, రైతుల పంటలకు మద్దతు ధరలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల వంటివి ప్రధాన అంశాలుగా నిలిచాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145 సీట్లు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీ (149), ఏక్ నాథ్ షిండే శివసేన (81), అజిత్ పవార్ ఎన్సీపీ (59) స్థానాల్లో పోటీ చేశాయి. మహా వికాస్ అఘాడి కూటమిలో భాగంగా కాంగ్రెస్ (101), ఉద్ధవ్ ఠాక్రే శివసేన (95), శరద్ పవార్ ఎన్సీపీ (86) స్థానాల్లో బరిలోకి దిగాయి. మహారాష్ట్ర ఎన్నికల బరిలో బీఎస్పీ 237 మందిని దింపగా.. ఎంఐఎం 17 మందిని పోటీలో నిలిపింది. 156 అసెంబ్లీ స్థానాల్లో వివిధ పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు పోటీ చేశారు.
ALSO READ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్
జార్ఖండ్ వివరాలు:
జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా జేఎంఎం (43), కాంగ్రెస్ (30), ఆర్జేడీ (6), సీపీఐఎంఎల్(2) స్థానాల్లో పోటీ చేశాయి. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ (68), ఏజేఎస్యూ ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ (10), జేడీయూ (2), లోక్ జన శక్తి (1) స్థానంలో బరిలో నిలిచాయి. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 42 స్థానాలు. జార్ఖండ్‌లో గెలుపుపై ఎన్డీఏ, ఇండియా కూటములు ధీమాగా ఉన్నాయి. ఎన్నికల తర్వాత వెలువడిన ఎగ్జాట్ పోల్స్ మాత్రం జార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పట్టాం కట్టాయి.