వీడీసీలపై ఉక్కుపాదం : సీపీ సాయి చైతన్య

వీడీసీలపై ఉక్కుపాదం : సీపీ సాయి చైతన్య
  • బాధితులు లోకల్ ఠాణాలకు వెళ్లాలి
  • సీపీ సాయి చైతన్య

నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని విలేజ్ డెవలప్​మెంట్​ కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా గ్రామాల్లో చెలాయిస్తున్న పెత్తనంపై ఉక్కుపాదం మోపుతామని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు. బుధవారం మీడియాకు సీసీ  ప్రకటన రిలీజ్​ చేశారు.  చట్టాలకు లోబడి వ్యహరించాలని, సొంత నిర్ణయాలకు తావులేదన్నారు.   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం తీసుకునే ఆలోచనతో 15 ఏండ్ల క్రితం వీడీసీలు ఏర్పడ్డాయన్నారు. కాలక్రమంలో సివిల్, భూ తగాదాల్లో తలదూర్చడం అలవాటు చేసుకున్నారన్నారు.

భార్యభర్తలు, అన్నదమ్ముల మధ్య తగాదాల్లో  ఏకపక్ష తీర్పులు ఇస్తున్నారన్నారు. వినని వ్యక్తులపై జరిమానాలు, బహిష్కరణ శిక్షలు విధిస్తున్నారన్నారు. బెల్ట్​ షాప్​లు, కూల్​ డ్రింక్​లు ఆఖరికి కోడిగుడ్డు ధరను కూడా వేలం పాటలతో నిర్ణయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇరువర్గాల మధ్య పంచాయితీ నిర్వహించడానికి కూడా డబ్బు వసూలు చేసి దావత్​లు చేసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. చట్టాలను ఖాతరు చేయకుండా చెలాయిస్తున్న డామినేషన్​ వీడీసీలు మానుకోవాలని హెచ్చరించారు. వీడీసీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులు దగ్గరలోని పోలీస్​ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.