సూర్యాపేట, వెలుగు : ప్రకృతి వైపరీత్యాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణం సాయం కింద రూ.10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కోదాడలో వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు, ఇండ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు, ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.50 వేలు నష్టపరిహారం అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చొప్పున, ఇసుక మెటల్ పెట్టిన పొలాల రైతులకు అదనంగా రూ.10 వేలు, ముంపునకు గురైన ఇంటి యజమానులకు రూ.20 వేల తక్షణ సాయం ప్రకటించాలన్నారు. వరదలకు దెబ్బతిన్న కాల్వలు, చెరువులు, రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎల్లవుల రాములు, అనంతుల మల్లేశ్వరి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్, ఎల్లంల యాదగిరి, ధూళిపాల ధనంజయ నాయుడు, కంబాల శీను, బద్దం కృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వర్లు, ఎస్కే లత్తు, దేవర మల్లేశ్వరి, బూర వెంకటేశ్వర్లు, గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.