కుంట్లూరులో గుడిసెలు వేసుకున్నవారందరికీ ఇండ్లు ఇవ్వాలి : కూనంనేని సాంబశివరావు

కుంట్లూరులో  గుడిసెలు వేసుకున్నవారందరికీ ఇండ్లు ఇవ్వాలి :  కూనంనేని సాంబశివరావు
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 

హైదరాబాద్, వెలుగు: అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెట్, కుంట్లూరులో అగ్ని ప్రమాదంలో ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయం కింద రూ.లక్ష ఇవ్వాలని సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెట్ రెవెన్యూ పరిధిలోని కుంట్లూరు వద్ద రావినారాయణ రెడ్డి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. అగ్నిప్రమాదంలో దాదాపు 300వరకు గుడిసెలు కాలిపోయాయని, గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైందని తెలిపారు. 

గుడిసెలు వేసుకున్నవారందరూ కష్టజీవులని, ఇండ్లలలో పనిచేసేవారు, ఆటోలు నడిపేవారని చెప్పారు. గుడిసెలు కాలిపోవడంతో పేదలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు వీధినపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం దగ్గరకు వెళ్లి వారికి పూర్తి నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ భూమిని భూ మాఫియా కొట్టేయకుండా తమ పార్టీ అడ్డుకున్నదని, ఈ కేసు కోర్టులో ఉందని ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరారు. దాదాపు 100 ఎకరాల్లో 8వేల మంది గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారందరికి ఇండ్డు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈటీ నరసింహ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజ్ రవీంద్రచారి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ముత్యాల యాదిరెడ్డి, కృష్ణ ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యుడు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.