
- వాళ్ల లెక్కలు తీసి హక్కులు పంచాలి: నారాయణ
న్యూఢిల్లీ, వెలుగు: దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బ్రిటీష్ ప్రభుత్వ కాలంలో 1931 వరకు బీసీల లెక్కలు తీశారని, కానీ స్వతంత్ర భారతంలో బీసీల లెక్కలు లేవని, అవి లేకపోవడంతో బీసీలు అభివృద్ధికి దూరంగా ఉంటూ.. తమ హక్కులను పొందలేకపోతున్నారని చెప్పారు. ఈ దేశం గణతంత్ర దేశంగా ఉందని, కులాల లెక్కలు తీసి హక్కులు పంచాలని కోరారు.
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు- చేయాలంటూ హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్, ఓబీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపకుడు జక్కని సంజయ్ తదితరులు ఆమరణ దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఈ నెల 1 నుంచి కొనసాగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని సీపీఐ నారాయణ, ఆ పార్టీ నేత అజీజ్ పాషా, బీఆర్ఎస్ ఎంపీలు సురేశ్ రెడ్డి, రవిచంద్ర శుక్రవారం సందర్శించి తమ సంఘీభావం తెలిపారు.