భారత్‌లో కమ్యూనిస్టు పార్టీ స్థాపించి వందేళ్లు కావస్తున్నది. ఇది వృద్ధాప్య సమస్యా! నాయకుల చారిత్రక తప్పిదాల సమస్యా! అని అర్థంగాక త్యాగాలు చేసిన కుటుంబాలు, కిందిస్థాయిలో రొమ్ము విరుచుకొని పనిచేసే కార్యకర్తలు తలబాదుకుంటున్నారు. గతి తార్కిక భౌతికవాదం గురించి ప్రజలకు చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. దానికి రంగనాయకమ్మ లాంటి వారు ఎలాగూ ఉన్నారు. కానీ పొత్తుల గురించీ కమ్యూనిస్టు నాయకులకు ఎవరూ చెప్పేవారు లేరని విజ్ఞులంటారు.
గత 5 ఏండ్ల పత్రికల్లో సీపీఎం, సీపీఐ తెలుగు రాష్ట్రాల ముఖ్యమైన ఇరుపార్టీల నాయకుల స్టేట్మెంట్స్ అన్నీ వరుసగా పెట్టి చూస్తే.. సురవరం సుధాకర్‌రెడ్డి, చాడ వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, బీవీ రాఘువులు, కె.నారాయణ వీళ్లు పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో.. ‘మతోన్మాదాన్ని పారదోలుదాం’, ‘మోదీని గద్దె దింపుతాం’, ‘హిందూ ఫాసిజంపై పోరాటం’.. ఇంతకు మించి సారాంశం మనం చూడలేం.
వీళ్లకు దాస్‌కాపిటల్ కన్నా ఇపుడు ఈ మూడు వాక్యాలే ముఖ్యం. ఇందులో డొల్లతనం గ్రహించకుండా ఇచ్చే ఒకే రకమైన ప్రకటనలు చెప్పేవారి కన్నా వినేవాళ్లకు జుగుప్స కలిగిస్తున్నాయి. అన్ని మతాల మతోన్మాదం నశించాలంటే అది వాళ్ల గొప్పతనం తెలియజేసేది. అన్ని మతాల ఫాసిజంపై పోరాటం చేస్తాం అంటే వాళ్ల విప్లవానికి ప్రజలు జోహార్లు చెప్పేవారు. మోదీపై రాజకీయ పోరాటం చేస్తాం అంటే వాళ్ల ప్రజాస్వామ్య దృక్పథం కనిపించేది. అలా కాకుండా మోదీ బీజేపీవాడు కాబట్టి ఆరెస్సెస్వాడు కాబట్టి గద్దె దిగాలి అన్నమాట జనసామాన్యం ఎలా మెచ్చుకుంటది?
సెలెక్టెడ్ క్యాంపెయిన్?
కేంద్రంలోని సీతారాం ఏచూరి, డి.రాజా, ప్రకాశ్‌కారత్, బృందాకారత్ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించలేం. ఒక వ్యక్తిని విధానాల పరంగా విమర్శ చేయడం హర్షణీయం. అలాకాకుండా ప్రతిరోజు ఒకే రకమైన విమర్శను ‘చర్విత చర్వణం చేయడం ఈ దేశ ప్రజలు హర్షిస్తున్నారా! అని ప్రజానాడి కనుక్కోని వారిది వాచాలత్వమా! వ్యూహాత్మక తప్పిదమా! అనేది వాళ్ల తప్పిదాల లిస్టు చూస్తే అర్థం అవుతుంది. వాళ్లు ఓసారి టీడీపీతో, మరోసారి కాంగ్రెస్‌తో, ఇంకోసారి జనసేనతో, మరోసారి కేసీఆర్‌తో ఇప్పుడు ఇంకెవరో...!? అన్న ప్రశ్న వాళ్లను తోకపార్టీలుగా మార్చింది. ఫాసిజం అంటూ విమర్శించే వీళ్లకున్న ఫెనటిక్ మెంటాలిటీ రాఘవులు నేతృత్వంలో సీపీఎం పార్టీ వ్యతిరేకం అంటూ ఏడ్పురాగం అందుకొంది.
దాన్ని సరిదిద్దుకునేందుకు తమ్మినేని వీరభద్రం పాదయాత్ర బొబ్బలెక్కేటట్లు చేసి ముగింపు సభకు పినరయిన్ గెస్ట్‌గా తీసుకొచ్చి కేసీఆర్ దగ్గరకు భోజనానికి పంపించారు.
స్వాతంత్య్రోద్యమంలో గాంధీని, బోసును, అంతకన్నా ముందు వివేకానందను, అరవిందుణ్ని, సావర్కర్‌ను తిట్టిపోశారు. ఆఖరుకు మొదట్లో మనదేశంలోకి కంప్యూటర్ వస్తే దాన్ని వ్యతిరేకించారు. ఇదీ వాళ్ల ప్రగతిశీల దృక్పథం. ఇప్పుడు దేశంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే ‘సెలెక్టెడ్’ క్యాంపెయిన్ చేస్తుంటారు.
బీజేపీ రాష్ట్రాల్లో జరిగితే వెంటనే కొవ్వొత్తుల ర్యాలీలు ‘ది వైర్’ కథనాలు వండి వారుస్తారు. ఇతరచోట్ల జరిగితే తేలు కుట్టిన దొంగల్లా మౌనవ్రతం వహిస్తారని అందరూ ఆరోపిస్తున్నారు. ఇదంతా వాళ్ల క్రెడిబులిటీ పోగొడుతుందనే ఆలోచన ఒక్కక్షణం కూడా చేయరు. మునుగోడు ఎన్నికలకు ముందు తమ్మినేని కృష్ణయ్య హత్యకేసు వీరభద్రం మెడకు చుట్టుకుందని అందరూ అనుకున్నారు.
ఆ కేసు తేలలేదు, ఎన్నికా అయిపోయిందని ఇపుడు ప్రజలంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఓవైపు ఆర్టీసీ కార్మికుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే, సీపీఐ హుజూరునగర్ ఉప ఎన్నికలో అప్పటి టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది. ‘కార్మికుల పక్షపాతులం’ , ‘ప్రపంచ కార్మికులారా ! ఏకం కండి’ అన్న ఈ ‘అపర నంబూద్రిపాద్’లు ఏంచేశారో ప్రజలు గమనించలేదా?
చరిత్రలో ఇలా..
ప్రపంచ చరిత్రలో కమ్యూనిజం చేసిన పాపాలు తక్కువేం కాదు. జోసెఫ్ స్టాలిన్ విప్లవం ఏమోగానీ ట్రాట్స్కీ లాంటి వాళ్లు దారుణంగా చనిపోయారు కదా! మావో సే టుంగ్ మహిమ ఏంటోగానీ తియాన్మెన్ స్క్వేర్ ఘటన ఎంతో ఘోరం. ఇప్పటికీ మేధోవర్గం వారసులు జేఎన్‌యూ, డీయూలలో ఉద్యోగాలు చేస్తుంటే అణగారిన కులాల బిడ్డలు అడవుల్లోకి వెళ్లి దిక్కులేని చావు చచ్చారు. కమ్యూనిస్టు పార్టీల్లోనూ ‘మావోయిస్టు’ల్లాగా ఎన్కౌంటర్ కాలేదు గానీ కిందిస్థాయి కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఆఖరుకు తెలంగాణ సాయుధ పోరాటంలో మరణించిన నాలుగువేల మంది అమరుల పేర్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు బయటపెట్టగలవా?
థియరీ కమ్యూనిస్టు పార్టీల్లో నేర్చుకొని1968 తర్వాత ప్రాక్టికల్స్‌కు నక్సల్స్ వెంటవెళ్లిన వారి కుటుంబాలది మరింత దీనస్థితి. 1984 తర్వాత కమ్యూనిస్టు పార్టీలది బీజేపీ, ఆర్ఎస్ఎస్లపై గుడ్డి వ్యతిరేక వైఖరి. అదే మోదీని గద్దెపై కూర్చోబెట్టింది. కమ్యూనిస్టు పార్టీ ఆర్ఎస్ఎస్ రెండూ1925 ప్రాంతంలోనే ఇక్కడ ప్రభవించాయి. ఆర్ఎస్ఎస్ ఎంత గౌరవప్రదమైన స్థానం సంపాదించిందో కమ్యూనిస్టు పార్టీలు అంతటి అథఃపాతాళంలోకి ఎందుకు పోతున్నాయో కామ్రేడ్స్ ఆలోచిస్తే మంచిది. కమ్యూనిస్టులు కేసీఆర్ వద్దంటే, కాంగ్రెస్ వద్దకు వెళ్లొచ్చు. చరిత్రకారులను ఎందర్నో సృష్టించిన మిమ్మల్ని చరిత్రలో తప్పిదాల తవ్వకాల్లో గుర్తించేటట్లు చూడొద్దు.
ఎన్నికల్లో పోటీ..
2014 శాసనసభ ఎన్నికల్లో 37 స్థానాల్లో ఒంటరిగా పోటీచేసిన సీపీఎం భద్రాచలం సీటును గెలుచుకొని మూడు లక్షల ఓట్లు సంపాదించింది. గత ఎన్నికల్లో 28 చిన్న పార్టీలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 107 చోట్ల పోటీ చేస్తే సీపీఎంకు 91,099 ఓట్లు వచ్చాయి. తెలంగాణలో 13 స్థానాల్లో బలంగా ఉన్న సీపీఎం రోజురోజుకూ దిగజారుతోంది. ఆఖరుకు జూలకంటి రంగారెడ్డి 11 వేల ఓట్లతో నాలుగోస్థానంలో నిలిచాడు. కమ్యూనిస్టులు రోజూ అండగా నిలబడే ఓల్డ్‌సిటీలో మైనార్టీలు వార్డు మెంబర్కన్నా హీనమైన స్థాయిలో నిలిపారు. సరే! సిద్ధాంతపరంగా అవినీతిలేదనుకుందామా?2012 తర్వాత అభ్యుదయ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటైన ఓ చానల్ ఎందుకు పక్కవాళ్ల రిమోట్ కంట్రోల్లోకి వెళ్లిందో ఇప్పటికీ ఏ మేధావీ చెప్పడు. పార్టీ పెద్దలు చెప్పే సిద్ధాంతాలన్నీ సామాన్యుల కోసమే.
డా.పి.భాస్కరయోగి, సోషల్ ఎనలిస్ట్