- ల్యాండ్ కార్డుతో పేదల భూములకు అన్యాయం
- జమిలి ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగే..
- సీపీఎం కేంద్ర పొలిట్ బ్యూరో కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు
సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని అప్పుడు బీఆర్ఎస్ పాలకులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న విదేశీ పర్యటనలతో వచ్చిందేమీ లేదని సీపీఎం కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. సోమవారం సిద్దిపేటలో సీపీఎం కార్మిక కర్షక భవన్ ను సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములుతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. విదేశీ పర్యటన కోసమంటూ సీఎం రేవంత్ రెడ్డి తీర్థయాత్రల్లాగా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
నల్ల ఒప్పందాల కోసమే వెళ్తున్నారని, పర్యటనలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. 50 లక్షల మందికి ల్యాండ్ కార్డు ఇస్తామని ప్రధాని మోదీ చెబుతున్నారని, దీనివల్ల పేదల భూములకు అన్యాయం జరుగుతుందన్నారు. భవిష్యత్ లో ల్యాండ్ కార్డు ఉమ్మడి రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉందని.. వెంటనే అప్రమత్తమై పోరాడాలన్నారు. కేంద్ర అనాలోచిత నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకే ఓటు ఒకే ఎన్నిక ద్వారా సీపీఎంకు పోయేదేమీలేదని , బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలే కనుమరుగవుతాయన్నారు.
ఇది తెలియని బీఆర్ఎస్ జమిలి ఎన్నికలపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమ, రాష్ట్ర నేతలు పాల్గొన్నారు.