
మోతే (మునగాల), వెలుగు : మిర్చి పంటకు కనీస మద్దతు ధర రూ.25 వేలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మట్టిపల్లి సైదులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో సీపీఎం గ్రామశాఖ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన మిర్చికి ధర దారుణంగా పడిపోయిందన్నారు. మిర్చికి క్వింటాల్‌కు రూ25 వేలు వుండాల్సిన పరిస్థితి నుంచి రూ.12 వేలకు తగ్గించి రైతులకు మద్దతు ధర లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. మిర్చి బోర్డును ఏర్పాటు చేసి మద్దతు ధర నిర్ణయించే విధంగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు గుంటగాని ఏసు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.