- ప్రజా పోరాటాలతో కేంద్రం మెడలు వంచుతాం
గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రజా పోరాటాలతో కేంద్రం మెడలు వంచుతామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ రణభేరి యాత్ర బుధవారం గోదావరిఖనికి చేరుకుంది. దీంతో పట్టణంలోని మెయిన్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో రాఘవులు మాట్లాడారు. సింగరేణిని కాపాడుకోవడానికి ప్రజలు, కార్మికులు పోరాటాలు చేయాలన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేట్‌కు అప్పగిస్తే సింగరేణిపై ఆధారపడిన వేలాది కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
ప్రైవేట్ వ్యక్తులు ప్రజల అభివృద్ధి కోసం నిధులు కేటాయించే అవకాశం ఉండదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తే నాలుగు వేల మంది కార్మికులు ఉద్యమం చేసి రక్షించుకున్నారని, వారి స్ఫూర్తితో సింగరేణి కార్మికులు కూడా పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. బొగ్గు బ్లాక్‌ల వేలం విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలపాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య అధ్యక్షతన జరిగిన సభలో యాత్ర రథసారథి ఎస్.వీరయ్య, లీడర్లు భూపాల్, ఆశయ్య, పి.రాజారావు, మంద నర్సింహారావు, ఎ.ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, ఎ.మహేశ్వరి, ఎం.రామాచారి పాల్గొన్నారు.