
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్..పోలీసు రిమాండ్‌లో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రభుత్వం స్పందించి సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారనే అభియోగంతో సంపత్ ను నిజామాబాద్ సైబర్ క్రైం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని చెప్పారు.
కస్టడీలో పోలీసు చిత్రహింసలు పెట్టడంతో ఆయన చనిపోయారని, శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయన్నారు. సంపత్‌ను చూడటానికి కుటుంబ సభ్యులను కూడా అనుమతించలేదని ఆరోపించారు. పోలీసులు చేసే చిత్రహింసలకు ప్రభుత్వం సహకరిస్తే..అది సమాజంలో ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని జాన్‌వెస్లీ కోరారు.