హైదరాబాద్, వెలుగు: గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఓ ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల అద్దె భవనాలకు అద్దెలు చెల్లించకపోవడంతో యజమానులు హాస్టళ్లకు తాళాలు వేశారని, తక్షణమే భవనాలను తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా గురుకులాలకు సొంత భవనాలు నిర్మించలేదన్నారు. ప్రభుత్వం చెల్లిస్తున్న మెస్ చార్జీలు విద్యార్థులకు కనీసస్థాయి ఆహారం అందించడానికి సరిపోవడం లేదని, ఆరేండ్ల నాటి మెనూనే నేటికి కొనసాగిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వ మెనూకు, సరుకుల ధరలకు పొంతనలేదని పేర్కొన్నారు. హాస్టల్స్ లో కుళ్లిపోయిన కూరగాయలు, నాసిరకమైన సరుకులతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని అన్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు.