Windies Cricket: వెస్టిండీస్ పేసర్‎పై రెండు మ్యాచుల నిషేధం

కెప్టెన్‎తో గొడవపడి మ్యాచ్ మధ్యలో మైదానాన్ని వీడిన వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డ్ చర్యలకు ఉపక్రమించింది. అల్జారీ జోసెఫ్‌పై క్రికెట్ వెస్టిండీస్ (CWI) రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి రానుంది. 

CWI క్రికెట్ డైరెక్టర్ మైల్స్ బాస్కోంబ్ ఈ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. క్రికెట్ వెస్టిండీస్ మైదానంలో..  మైదానం వెలుపల గౌరవం, సమగ్రత, క్రమశిక్షణతో కూడిన సంస్కృతికి కట్టుబడి ఉంటుందని వాగ్ధానం చేశారు. తప్పు ఎవరు చేసినా నిబంధనల ప్రకారం, నడుచుకుంటామని అన్నారు.

అంతకుముందు జోసెఫ్ తన తప్పును అంగీకరిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. "నేను కెప్టెన్ షాయ్ హోప్‌కి, నా సహచరులకు, మేనేజ్‌మెంట్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నాను. వెస్టిండీస్ అభిమానులకు కూడా నేను హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను.." అని జోసెఫ్ ప్రకటన చేశాడు.