30 రోజులకే పొలాలు పొట్టకొచ్చినయ్! మూడు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం

30 రోజులకే పొలాలు పొట్టకొచ్చినయ్!  మూడు జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం
  • నకిలీ సీడ్స్ కారణంగానే అంటున్న బాధిత రైతులు 
  • నష్టపరిహారం ఇప్పించాలని ఆఫీసర్లకు ఫిర్యాదు
  • పొలాలను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్  

నల్గొండ/ఖమ్మం, వెలుగు: యాసంగిలో సాగు చేసిన వరి పొలాలు 90 రోజులకు పొట్ట దశకు రావాల్సి ఉండగా 30 – 40 రోజుల్లోనే వచ్చాయి. ఇలాంటి పరిస్థితి నకిలీ విత్తనాలతోనే తలెత్తిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ సీడ్ తోనే నష్టపోయామంటూ సీడ్స్ కంపెనీలపై ఆఫీసర్లకు పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. ఎకరానికి రూ.35 వేల నుంచి 40 వేల వరకు ఖర్చు చేశామని, దిగుబడి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళనలో పడ్డారు. కంపెనీల నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. దీంతో రాష్ట్ర రైతు కమిషన్, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. 

5 వేల ఎకరాల్లో పంట నష్టం 

సూర్యాపేట జిల్లాలోని పొట్లపహాడ్, నేలమర్రి, అన్నా రం, వెంకట్రామపురం, మామిడాల,  నల్గొండ జిల్లాల్లోని కన్నెకల్లు, దుద్యా తండా, మీనా పాటి తండకు చెందిన రైతులు సుమారు 5 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా..  ముందుగానే పొలాలు పొట్ట దశకు వచ్చాయి. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం, కల్లూరు, సత్తుపల్లి, వేంసూరు మండలాల్లోని రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. బాధిత రైతుల వరి పొలాలను  వ్యవసాయ అధికారులు పరిశీలించి, వాతావరణ పరిస్థితుల కారణంగానే ముందుగానే  పొట్టదశకు వచ్చాయని పేర్కొంటున్నారు. శాంపిల్స్ తీసుకుని శాస్త్రవేత్తలకు పంపించామని, త్వరలోనే నివేదిక వచ్చిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.  

గడ్డిపల్లి కేంద్రంగా నకిలీ సీడ్స్ 

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కేంద్రంగా నకిలీ సీడ్ అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ 9 సీడ్స్ కంపెనీలు ఉండగా.. సొంతంగా వరి సీడ్ ను తయారు చేసి కొన్నేండ్లుగా రైతులకు అమ్ముతున్నారు. ప్రభుత్వ రూల్స్ మేరకు వ్యవసాయ పరిశోధన కేంద్రం బ్రీడర్ సీడ్ కొనుగోలు చేసి స్థానిక రైతుల పొలాల్లో సాగు చేయించాలి. ఆ తర్వాత చేతికొచ్చిన పంటను స్థానిక వ్యవసాయాధికారులు ధృవీకరించాకే  రైతులకు విత్తనాలుగా అమ్ముకోవాలి. కానీ వ్యాపారులు రైతుల వద్ద నేరుగా ధాన్యాన్ని క్వింటా రూ.2వేల నుంచి రూ.3500ల వరకు కొనుగోలు చేసిన అనంతరం వాటిని అరబెట్టి తాలు, పెల్లా, చెత్త చెదారం లేకుండా శుద్ధి చేసి తిరిగి రైతులకు విత్తనాలు అంటగడుతున్నట్టు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. 

  ప్రభుత్వానికి రిపోర్ట్ అందిస్తాం : రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్

నకిలీ విత్తనాలతో మోసపోయిన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం పొట్లపహాడ్ గ్రామ రైతుల పొలాలను గురువారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు పరిశీలించారు. అనంతరం కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. గడ్డి పల్లిలోని వెంకటసాయి సీడ్స్ కంపెనీ నుంచి కొను గోలు చేసిన సిరి 101, కావేరి సింట్లు రకానికి చెంది న వరి విత్తనాలు 30 రోజుల్లోనే పొట్ట దశకు రావడంపై కమిషన్ దృష్టికి రాగా క్షేత్ర స్థాయిలో పర్యటించామని తెలిపారు. వాతావరణ మార్పులతో వరికి తెగుళ్లు వస్తాయని.. కానీ పొలం నాటిన 40 రోజులకే పొట్టదశకు వచ్చిందంటే నకిలీ విత్తనాలతోనే సమస్య వచ్చిందని పేర్కొన్నారు. 

మెరుగైన సర్టిఫైడ్ విత్తనాలు కాదని నిర్ధారించినట్టు చెప్పారు. బాధిత రైతులు సమస్యపై నివేదికగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు.  కంపెనీలు వ్యాపారం దృష్ట్యా కాకుండా రైతు నష్ట పోకుండా విత్తనాలు అందించాలని సూచించారు. డీలర్ షిప్ పర్మిషన్, సర్టిఫికెట్ కలిగిన విత్తన కంపెనీలు మాత్రమే అమ్మేలా చూడాలని అధికారులకు సూచించారు. వ్యవసా య కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, సునీల్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, భవాని, జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.