ప్రభుత్వ బాలికల హాస్టళ్లకు మహిళా ఐఏఎస్​లు

  • డైయిట్ నిర్వహణతోపాటు పలు అంశాలు పరిశీలన
  • అధికారులతో సీఎస్​ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్​ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టళ్లను మహిళా ఏఐఎస్ అధికారులు తనిఖీ చేసి, హాస్టళ్లలో రాత్రి బస చేస్తారని సీఎస్​ శాంతి కుమారి వెల్లడించారు. సెక్రటేరియెట్​నుంచి గురువారం ఉన్నతాధికారులతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  రాష్ట్రంలో 540 బాలికల సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని తెలిపారు. వాటిలో విద్యాప్రమాణాలు పెంచడంతో పాటు ఇటీవల పెంచిన డైయిట్ చార్జీల ప్రకారం బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. 

ఈ హాస్టళ్లను తొలిదశలో 29 మంది మహిళా ఐఏఎస్ అధికారులు సందర్శించి ప్రస్తుత పరిస్థితులను స్వయంగా పరిశీలించాలన్నారు. హాస్టళ్లలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతో పాటు, వీటిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తగు ప్రతిపాదనలను అందచేస్తారని వివరించారు.

కామన్ డైయిట్ నిర్వహణ, విద్యా ప్రమాణాలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, హాస్టళ్ల నిర్వహణ తదితర అంశాలను మహిళా అధికారులు పరిశీలిస్తారని వెల్లడించారు. ఈ నెల 25 వ తేదీలోపు తొలిదశ తనిఖీలు పూర్తి చేస్తారని సీఎస్​ తెలిపారు.  ఈ తనిఖీలు తరువాత వచ్చిన ఫీడ్ బ్యాక్ పై సవివరమైన సమీక్ష చేపడతామని పేర్కొన్నారు.

జైపాల్ రెడ్డి జయంతికి ఏర్పాట్లు చేయండి

మాజీ కేంద్ర మంత్రి, దివంగత ఎస్. జైపాల్ రెడ్డి 83వ జయంతిని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్​శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఎస్. జైపాల్ రెడ్డి జయంతిని ఈ నెల16న స్టేట్ ఫంక్షన్ గా జరపాలని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సీఎస్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

నెక్లెస్ రోడ్డులోని జైపాల్ రెడ్డి మెమోరియల్ స్ఫూర్తి స్థల్ లో సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగకుండా శానిటేషన్, పార్కింగ్, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొన్నారు.