దసరా నుంచి స్కిల్ వర్సిటీ.. ఆరు కోర్సులకు అడ్మిషన్లు

దసరా నుంచి స్కిల్ వర్సిటీ.. ఆరు కోర్సులకు అడ్మిషన్లు
  • తాత్కాలిక భవనంలో తరగతులు
  •  పరిశీలనలో మూడు భవనాలు
    20 కోర్సుల గుర్తింపు.. ఆరింటిలో అడ్మిషన్లు 
  • భాగస్వామ్యానికి 40 కంపెనీల ఆసక్తి
  • త్వరలో వెబ్ సైట్, లోగో విడుదల చేస్తం
  • సీఎస్ శాంతి కుమారి వెల్లడి

హైదరాబాద్:  దసరా నుంచి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభమవుతుందని సీఎస్ శాంతి కుమారి చెప్పారు. ఇవాళ సెక్రటేరియట్ లో ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై నేడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు రూపుదిద్దుకున్నాఈ వర్సిటీకి ఆనంద్ మహీంద్రను చైర్మన్ గా ,శ్రీనివాస సి రాజును కో చైర్మన్ గా నియమించామని అన్నారు. మొత్తం 20 కోర్సులు ప్రారంభించాలని భావించామని, ఈ సారి ఆరు కోర్సులను ప్రారంభిస్తామని అన్నారు. 

ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకు స్థాపన చేశారని, ఈ నిర్మాణ పనులు ముగిసేంతవరకు ఈ యూనివర్సిటీ ని తాత్కాలిక భవనంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇందుకు గాను, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా గానీ, నాక్ లేదా నిథమ్ లో నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని, దాదాపు 20 కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించగా, తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్ కోర్స్ లు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు.  

వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎస్బీఐ , న్యాక్ , డాక్టర్ రెడ్డీస్, టీవీఏజీఏ , అదానీ సంస్థలు భాగస్వాములుగా  ఉండేందుకు అంగీకరించాయని అన్నారు. వీరితోపాటు సీఐఐ కూడా ముందుకు వచ్చిందని వెల్లడించారు. ఈ యూనివర్సిటీ కి సంబందించిన లోగో ను, వెబ్ సైట్ ను ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ యూనివర్సిటీ లో కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామ కృష్ణారావు, జయేష్ రంజన్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐసి ఎండీ విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకట రమణ,  శ్రీని రాజు, వీవీఎల్ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు