- 2020లో 32వేల ఎకరాల్లో సాగవగా.. 2024లో 3 వేలకు తగ్గింది
- సాగు అంటే ‘వరి’ అన్నట్లు మారింది
- ఆరోగ్యరీత్యా చిరుధాన్యాలకు పెరిగిన డిమాండ్
- దిగుమతులపైనే ఆధారం
- సరైన మార్కెటింగ్ వ్యవస్థ, క్వాలిటీ సీడ్స్ లేకపోవడమే కారణం
పెద్దపల్లి, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిరుధాన్యాల సాగు క్రమంగా తగ్గుతోంది. నాలుగేండ్ల కింద 32 వేల ఎకరాల్లో సాగయిన చిరుధాన్యాలు.. నేడు 3 వేల ఎకరాలకు తగ్గడం గమనార్హం. సాగు అంటేనే ‘వరి’ అనేలా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కందులు, పెసర్లు, మినుములు, రాగులు, సజ్జలు, సోయాబీన్స్‌ను చిరుధాన్యాలుగా పిలుస్తుంటారు.
ఆరోగ్య రీత్యా చిరుధాన్యాల వినియోగం నానాటికీ పెరుగుతోంది. ఇదే క్రమంలో సాగు పడిపోతుండడంతో దిగుమతులపైనే ఆధారపడాల్సిన వస్తోంది. ఈక్రమంలో వీటి ధరలు కొండెక్కుతున్నాయి. సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడంతోపాటు క్వాలిటీ సీడ్స్ లభించకపోవడం, అనుకున్న స్థాయిలో దిగుబడులు రాకపోవడం చిరుధాన్యాల సాగు తగ్గడానికి కారణంగా తెలుస్తోంది.
కేజీ రూ.200 నుంచి రూ.300
ఆరోగ్య రీత్యా మిల్లెట్స్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో మార్కెట్లో ఒక్కో రకం రూ.200 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. మరోవైపు దిగుబడులు తగ్గడంతో దిగుమతులు పెరగడం కూడా రేట్లు పైపైకి పోతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2020లో ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న 10.26 లక్షల ఎకరాల్లో సాగవగా.. చిరుధాన్యాలు కందులు, పెసర్లు, మినుములు, రాగులు, సజ్జలు, సోయాబీన్స్ 32 వేల ఎకరాల్లో సాగయ్యేవి. అదే 2024కి వచ్చేసరికి ప్రధాన పంటల సాగు 10.89 లక్షల ఎకరాలకు పెరగగా చిరుధాన్యాల సాగు 3600 ఎకరాలకు పడిపోయింది.
ఆసక్తి చూపని రైతులు
క్వాలిటీ సీడ్స్, ఎక్కువ శ్రమ చేయాల్సి రావడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అంతంతమాత్రంగానే ఉండడం కూడా మిల్లెట్స్ సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉండడంతో రైతులంతా వరి, పత్తి సాగు వైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. అలాగే వరికి వివిధ రకాలైన సబ్సిడీలు, కొనుగోలు సెంటర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుండడం కూడా వీటి సాగు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా ఆరోగ్యరీత్యా డాక్టర్ల సలహాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు.
ముఖ్యంగా జొన్న అంబలి, రాగి జావా, మక్క గట్కా, ఉలువ చారు, కొర్రల దోశ లాంటి ఆహారాలకు అలవాటు పడ్డారు. దీంతో చిరుధాన్యాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడం ప్రభుత్వ సబ్సిడీలతోనే సాధ్యమవుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నూనె పంటల సాగు పెంచాలనే ఉద్దేశంతో ఆయిల్‌పామ్ తోటలకు ప్రోత్సహాకాలు ఇస్తోంది. అలాగే చిరుధాన్యాల సాగును కూడా ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.