- అక్కాచెల్లెళ్లకు బెదిరింపులు
- తమ్ముడి ఫోన్కు వాటిని పంపిన నేరగాళ్లు
- పోలీసులకు బాధిత యువతుల ఫిర్యాదు
బషీర్ బాగ్, వెలుగు: స్కాలర్ షిప్ ఇస్తామని అక్కాచెల్లెళ్లను నమ్మించిన సైబర్ నేరస్తులు వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం వాటిని తమ్ముడి మొబైల్ ఫోన్ కే పంపించారు. తాము చెప్పినట్టు వినాలని లేకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామన్నారు. హైదరాబాద్ సిటీకి చెందిన 26 ఏండ్ల యువతికి ఐఎంవో యాప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము ఓ మతపరమైన సంస్థ స్కాలర్ షిప్ విభాగంలో పని చేస్తున్నట్టు సైబర్ చీటర్స్ పరిచయం చేసుకున్నారు. తమ సంస్థ పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తోందని నమ్మబలికారు.
బాధిత యువతికి కూడా వారంలో స్కాలర్ షిప్ అందజేస్తామన్నారు. దీనికోసం జీమెయిల్ఐడీ, పాస్ వర్డ్, ఇతర వివరాలు తీసుకున్నారు. ఇంకా ఎవరైనా విద్యార్థులుంటే, వారి వివరాలను తెలపాలని కోరడంతో, బాధిత యువతి తన సోదరి, స్నేహితుల జీమెయిల్, ఐడీ పాస్ వర్డ్, మొబైల్ నంబర్లను షేర్ చేసింది. జీమెయిల్ అకౌంట్ ద్వారా అక్కాచెల్లెళ్ల గూగుల్ ఫొటోలను డౌన్లోడ్చేసిన సైబర్ చీటర్స్ వాటిని మార్ఫింగ్ చేసి వారి సోదరుడి నెంబర్ కు పంపించారు.
తాము చెప్పినట్టు వినాలని , లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో బాధిత అక్కాచెల్లెళ్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.