వరంగల్ కమిషనరేట్​ పరిధిలో నెలకు రూ.2 కోట్లు మాయం..!

వరంగల్ కమిషనరేట్​ పరిధిలో నెలకు రూ.2 కోట్లు మాయం..!
  • జనాల ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు
  • ట్రెండింగ్ లో స్టాక్​మార్కెట్, ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్
  • పెట్టుబడుల పేరున రూ.కోట్లు గల్లంతు
  • గ్రాడ్యుయేట్లనూ బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్​లో సైబర్​ నేరాలు దడ పుట్టిస్తున్నాయి. అకౌంట్​లో డబ్బులుంటే చాలు సైలెంట్​గా అటాక్​ చేస్తున్న సైబర్​దుండగులు, క్షణాల్లో వాటిని మాయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో స్టాక్​ మార్కెట్లు, వివిధ కంపెనీల్లో ఇన్​వెస్ట్​మెంట్ పేరున సైబర్​ నేరగాళ్లు జనాల జేబులకు చిల్లులు పెడుతున్నారు. స్మార్ట్​ ఫోన్ యూజ్​ చేస్తున్న జనాలను బురిడీ కొట్టించి, అందిన కాడికి దండుకుంటున్నారు. ఇలా వరంగల్ కమిషనరేట్  పరిధిలో నెలకు సగటున రూ.2 కోట్లకు పైగా గల్లంతవుతుండగా, బాధితుల్లో ఎక్కువ శాతం ఉన్నత చదువులు చదివిన వ్యక్తులే ఉండటం గమనార్హం. 

పెట్టుబడుల పేరున టార్గెట్..

ఈజీ మనీకి అలవాటైన వారిని సైబర్​ కేటుగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. స్టాక్​మార్కెట్లు, వివిధ మల్టీనేషనల్​ కంపెనీల్లో పెట్టుబడులు, కొత్త కంపెనీల్లో షేర్లు అంటూ దేశంలోని ఢిల్లీ, రాజస్థాన్, ఝార్ఖండ్, యూపీ, వెస్ట్​బెంగాల్​ తదితర రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల నుంచి అటాక్​ చేస్తున్నారు. కమిషనరేట్​లో జరుగుతున్న సైబర్​ నేరాల్లో సగానికిపైగా ఇన్వెస్ట్ మెంట్​ఫ్రాడ్సే ఉండటం గమనార్హం. కమిషనరేట్​లో నిరుడు నమోదైన 772 సైబర్​ కేసుల్లో రూ.24.7 కోట్లు గల్లంతవగా, అందులో పెట్టుబడుల పేరునే రూ.13.5 కోట్లు సైబర్​నేరగాళ్ల చేతిల్లోకి వెళ్లిపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

చదువుకున్నోళ్లే ఎక్కువ.. 

సైబర్​ నేరాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం విద్యావంతులే ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కమిషనరేట్​లో వివిధ ఆఫీసర్లు, ప్రముఖులు, ఇతర వ్యక్తుల పేరు చెప్పి సైబర్​ నేరగాళ్లు దాదాపు రూ.1.10 కోట్లు కొట్టేశారు. వీటితోపాటు కమిషనరేట్ పరిధిలో ఇటీవల కొరియర్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువవుతున్నాయి. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్​చేసి మీపేరున వచ్చిన పార్సిల్​లో డ్రగ్స్​ఉన్నాయని, మనీ లాండరింగ్​ కేసులో ఇన్వాల్వ్​ అయ్యారని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా కేవలం ఐదు కేసుల్లోనే సైబర్​ నేరగాళ్లు రూ.66 లక్షలకుపైగా కొట్టేయడం గమనార్హం. 

ఏటా రూ.కోట్లు గల్లంతు..

వరంగల్​ కమిషనరేట్​ పరిధిలో ఏటా రూ.కోట్లు సైబర్​ దాడుల్లో గల్లంతవుతున్నాయి. నెలకు సగటున రూ.2 కోట్ల వరకు సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తున్నాయంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2024లో రూ.24.7 కోట్లు, 2023లో రూ.18.7 కోట్లు, రూ.2022లో రూ.10.99 కోట్లు సైబర్​ నేరగాళ్లు జనాల ఖాతాల్లోంచి కొట్టేశారు. సైబర్​ నేరాల నియంత్రణకు వరంగల్ లో ఏసీపీ విజయ్​ కుమార్​ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 14 మంది సిబ్బందితో సైబర్​ క్రైమ్​ పోలీస్​ స్టేషన్ ఏర్పాటు చేశారు.

 కానీ, దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి కూడా సైబర్​ దాడులు జరుగుతుండటంతో ఆఫీసర్లు కూడా వారిని గుర్తించలేని పరిస్థితి ఎదురవుతోంది. ఫలితంగా ఏటా రికవరీ పర్సంటేజీ కూడా చాలా తక్కువగా ఉంటోంది. జనాల అవగాహనతోనే సైబర్​ నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.

అనవసర యాప్స్ వాడొద్దు..

సైబర్​ నేరాలు పెరిగిపోతున్న విషయం వాస్తవమే. సోషల్​ మీడియా ప్లాట్​ ఫామ్స్ లో వ్యక్తిగత సమాచారాన్ని షేర్​ చేసుకోవడం, లోన్ యాప్స్, అనవసర అప్లికేషన్లు వినియోగించడం వల్ల సైబర్​ నేరగాళ్లు ఈజీగా హ్యాక్​ చేస్తున్నారు. సైబర్​ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 

సైబర్ నేరాల బారిన పడితే 1930 కు కాల్ లేదా నేషనల్ సైబర్​ క్రైమ్​పోర్టల్​లో ఫిర్యాదు చేయాలి. నేరుగా సైబర్​ క్రైమ్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినా, దర్యాప్తు చేపట్టి అమౌంట్ రికవరీ చేసేలా తగిన చర్యలు తీసుకుంటాం.  - విజయ్ కుమార్, సైబర్ క్రైమ్స్ ఏసీపీ, వరంగల్