
పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ చైర్ పర్సన్‌గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ కమిటీలో మొత్తం 30 మంది(20 మంది లోక్ సభ+ 10 మంది రాజ్యసభ) సభ్యులను నియమించారు. ఈ కమిటీలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, సుధామూర్తి, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర అజిత్ పవార్, సినీ నటి హేమామాలిని, పాత్రికేయురాలు సాగరిక ఘోష్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
పార్లమెంట్ మహిళా సాధికార కమిటీ 1997లో ఏర్పాటైంది. ఇందులో లోక్‌సభ నుంచి 20 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. కమిటీ చైర్ పర్సన్‌ను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు. సభ్యుల పదవీకాలం సాధారణంగా ఒక సంవత్సరం ఉంటుంది.
కమిటీ లక్ష్యం
పార్లమెంట్ మహిళా సాధికారిక కమిటీ అనేది పార్లమెంట్లో ఒక ముఖ్యమైన స్థాయీ సంఘం. ఇది మహిళల స్థితిగతులను అధ్యయనానికి, వారి సాధికారత కోసం సిఫారసులు చేయడానికి, మహిళల చట్టాలు, విధానాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అని పరిశీలించడానికి ఏర్పాటైంది. స్త్రీల సమానత్వం, సాధికారతను సాధించడంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది.