దళిత్ ఎంపవర్ మెంట్ ఓట్ల కోసమేనా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే దళితులకు టీఆర్​ఎస్​ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అని స్వయంగా కేసీఆరే చెప్పారు. కానీ రాష్ట్రం ఏర్పాటై టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనే సీఎం కుర్చీలో కూర్చుని దళితులను మోసం చేశారు. మూడెకరాల భూమి, రిజర్వేషన్ల పెంపు, అంబేద్కర్​ విగ్రహం ఏర్పాటు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో హామీలను టీఆర్ఎస్​ సర్కారు తుంగలో తొక్కింది. పైగా దళిత సమాజాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలహీనపరచాలనే ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు హుజూరాబాద్​ ఉప ఎన్నిక రావడంతో ఓట్ల కోసం దళిత్​ ఎంపవర్​మెంట్​ అంటూ కొత్త మాటలు చెబుతోంది.
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం సుదీర్ఘకాలం కొనసాగి ప్రత్యేకతను చాటుకుంది. ఇందులో తెలంగాణకు చెందిన సబ్బండ వర్గాలు గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. ముఖ్యంగా ఉద్యమం, తెలంగాణ కల సాకారం చేయడం వరకు దళితుల పాత్ర మరువలేనిది. వీరంతా క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యం చేయడానికి అనేక రూపాలలో పనిచేస్తూ, ప్రాణ త్యాగాలకు సిద్ధపడ్డారు. ఈ త్యాగం వెనుక ఉన్న ప్రధాన కారణం ప్రత్యేక రాష్ట్రంలో తమ జీవితాలు బాగుపడతాయని దళితులంతా భావించడమే. చిన్న రాష్ట్రాలతో పరిపాలనా వికేంద్రీకరణ జరిగి సంక్షేమ ఫలాలు కింది స్థాయి వరకు చేరి అభివృద్ధి జరుగుతుందని చదువుకున్న దళిత యువకులు, మేధావులు అనుకున్నారు. దీనికనుగుణంగా దళిత సమాజం పోరాటం చేసింది కూడా. కానీ, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి, అనుసరిస్తున్న విధానాలు దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. స్వరాష్ట్రంలో దిగజారిన దళిత స్థితిగతులే దీనికి నిదర్శనం. 

ఆశలు ఆవిరైపోయినయ్​

తెలంగాణ వస్తే విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పొంది మా బతుకులు బాగుపడతాయని అనుకున్న వారి ఆశలు అడియాసలయ్యాయి. ఒక సామాజిక పరిణామం ఉన్నతికి, సమాజ పురోభివృద్ధికి దాని ఆస్తిత్వమే మూలం లాంటిది. దీన్ని చెరిపేయాలంటే దళిత సమాజాన్ని ఆర్థిక, రాజకీయ, సామాజికంగా బలహీనపరచాలి. ఈ రోజు రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అదే కోవకు చెందినది. నిజానికి సర్కార్ ఏర్పాటుకు ముందే టీఆర్​ఎస్ దళితులకు అనేక హామీలను తన మేనిఫెస్టోలో పెట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని చెప్పిన కేసీఆర్, మొదటిసారి టీఆర్​ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తానే ముఖ్యమంత్రి అయ్యాడు, అదిగో అప్పటి నుంచి ఇప్పటి వరకు దళితులకు ఇచ్చిన హామీలను నీరుగార్చడం షరా మామూలైపోయింది.

సాధికారత సాకారం కావాలంటే?...

దళితులు వేల ఏండ్లుగా దోపిడీకి గురవుతున్నారు. దళితుల్లో 59 ఉప కులాలు ఉన్నట్లు గుర్తించారు. వీరి సంక్షేమాన్ని భారత రాజ్యాంగం నొక్కి చెబుతోంది. ఆరో పంచవర్ష ప్రణాళిక ఎస్సీల సామాజిక, ఆర్థిక జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి ‘‘ఉప ప్రణాళిక భావన’’ను ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు వారి జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలనేది దీని లక్ష్యం. వాస్తవంగా ప్రతి రాష్ట్రం ఎస్సీ సబ్​ ప్లాన్ రూపొందించి వారి ఆర్థిక పరిపుష్టికి కృషి చేయాలి. కానీ పలు రాజకీయ పార్టీలు దళితుల సంక్షేమాన్ని ఎన్నికల తాయిలాలుగా చూస్తున్నారు. అనంతరం వారి సమగ్ర అభివృద్ధిని విస్మరిస్తున్నారు. దళితుల శ్రేయస్సే లక్ష్యంగా ఉమ్మడి ఏపీ నుంచి నేటి ప్రత్యే రాష్ట్రం కృషి చేస్తున్నట్టుగా చెప్తున్నప్పటికీ.. పురోగతి శూన్యం. ఈ నిర్లక్ష్య ధోరణి వలన అనేక మంది దళితులపైన దాడులు, అవమానాలు, హత్యలు, అత్యాచారాలు వంటివి పెరిగాయి. నేరెళ్ల మొదలుకొని రమోజీపేట, అల్మాస్ పూర్, మరియమ్మ లాకప్ డెత్ వరకు జరిగిన ఘటనలే ఇందుకు కొన్ని ఉదాహరణలు. 

రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలె

తెలంగాణలో ఎస్సీ ఎస్టీ సబ్​ ప్లాన్​ విషయానికి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ఎస్సీ స్పెషల్ డెవలెప్​మెంట్​ ఫండ్ గా పేరు మార్చింది. దీని ప్రకారం రాష్ట్రంలోని ఎస్సీ జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు జరగాలి. ఇలా కేటాయించిన డబ్బులను దళితుల అభివృద్ధి కోసం మాత్రమే ఉపయోగించాలి. మిగిలిన నిధులు మళ్లీ వచ్చే బడ్జెట్లో చేర్చి ఖర్చు చేయాలి. కానీ, ప్రస్తుత కేటాయింపులు ఆ స్థాయిలో ఉండడం లేదు. ప్రభుత్వాల చిత్తశుద్ధి మీదనే ఇదంతా ఆధారపడుతుంది. ఇప్పటికీ మెజార్టీ దళిత సమాజ విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి లాంటి ప్రాథమిక అవసరాలకు నోచుకోవడం లేదు. వీటిని తీర్చడానికి రంగాల వారీగా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి. దళితులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకు నుంచి లోన్ లు ఇప్పించాలి. వివిధ శాఖల్లో పేరుకుపోయిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాక్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. దళితులకు రాజకీయ ప్రాధాన్యం పెంచాలి. అప్పుడే దళితుల జీవితాల్లో సమూలమైన మార్పు వచ్చి సాధికారత సాధ్యమవుతుంది.

పక్కదారిపడుతున్న నిధులు

టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన అనంతరం దళితులకు మూడెకరాల సాగుభూమి పంపిణీ  చేస్తామని హామీ ఇచ్చింది. 2014-15 బడ్జెట్​లో ఈ పథకానికి 1000 కోట్లు కేటాయించింది. అలాగే దళితుల అభివృద్ధికి 2014-19 మధ్య 50 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడతామని పేర్కొన్నది. అయితే ఇప్పటివరకు 6890 మందికి 16,418 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. వాస్తవంగా అమలైన ఈ భూ పంపిణీ వల్ల మూడు లక్షల కుటుంబాలకు లబ్ధి జరిగేది. కానీ, మూడు శాతం లక్ష్యం కూడా చేరకుండానే మూలకు పడ్డది. దీన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు చేసిన పెద్ద మోసంగా చూడాలి. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 63,60,158 మంది దళితులున్నారు. అంటే రాష్ట్ర జనాభాలో 17.5 శాతం. ఇందులోని 67.4 శాతం మందికి ఒక గుంట భూమి కూడా లేదని సర్వే తేల్చింది. దళితుల జీవితాలు ఇంత దారుణ స్థితిలో ఉంటే... ప్రభుత్వం పట్ల వారి అసంతృప్తిని తన తనవైపు తిప్పుకునేందుకు అనూహ్య నిర్ణయాలను ఏ మేరకు సఫలీకృతం అవుతాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. హుజురాబాద్ ఎలక్షన్లలో ఎట్లాగైనా గెలవాలని... దళితుల సాధికారత అంశం హడావుడిగా అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం పెట్టారు. ఇందులో కేసీఆర్ మళ్లీ కొత్త రాగం ఎత్తుకున్నాడు.. అదే ‘‘దళిత ఎంపవర్ మెంట్” అనే పథకం. దీని కింద మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 100 చొప్పున 11,900 కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని, ఇందు కోసం ఈ ఏడాది రూ.12,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దళిత జనాభాతో పోల్చితే నియోజకవర్గానికి 100 కుటుంబాలు అనేది చాలా తక్కువ. అలాగే లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ గ్రామ, మండల స్థాయి నేతలు, కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తారు. ఎస్సీ కార్పొరేషన్ కింద లబ్ధిదారుల ఎంపికలో ఇదే జరుగుతుంది. ఈ ఏడేండ్లలో దళితుల అభివృద్ధికి చేపట్టిన ఏ పనిని సరిగ్గా పూర్తి చేయని ఈ సర్కార్​ కొత్తగా ఎత్తుకున్న ‘‘దళిత సాధికారత’’ అనే రాగం కూడా ఒక మోసపూరిత గిమ్మిక్కే. ఈ ఏడేండ్లలో సబ్ ప్లాన్ కింద దళితుల జనాభా ప్రకారం రూ. 85,912 కోట్లు కేటాయింపులు జరిగాయి. కానీ ఇందులో సగానికిపైగా నిధులు ఇతర పథకాలు, పనులకు మళ్లించారు. ఇలాంటప్పుడు దళితుల అభివృద్ధి ఎలా జరుగుతుందనేది మేధావుల ప్రశ్న.
- డాక్టర్ పెంట కృష్ణ,
అసిస్టెంట్​ ప్రొఫెసర్​, ఓయూ