తెలంగాణలో మరో 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ : మంత్రి దామోదర రాజ నర్సింహా

  • డీసీఏ అధికారులతో రివ్యూలో మంత్రి దామోదర 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  నాసిరకం, నకిలీ మందులు తయారు చేసేవారిపై, వాటిని అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా ఆదేశించారు‌. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో మరింత విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించాలన్నారు. 

ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో రాజీ పడరాదన్నారు. మెడిసిన్స్ కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో‌ కంప్లైంట్ సెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. డీసీఏ, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(టీజీఎంఎస్ఐడీసీ) అధికారులతో మంగళవారం వెంగళరావునగర్‌‌లోని డీసీఏ ఆఫీసులో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడిసిన్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

డ్రగ్ ఇన్ స్పెక్టర్ల సంఖ్య పెంచుతం

రాష్ట్రంలో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఒక్కటే ఉన్నందున ఎక్కువ శాంపిల్స్‌ను టెస్ట్ చేయలేకపోతున్నామని మంత్రికి అధికారులు తెలిపారు. 2014 నాటికి సుమారు 20 వేల మెడికల్ షాపులు ఉంటే, ఇప్పుడు 45 వేలకు పెరిగాయని.. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొత్తగా డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ రాలేదని, డ్రగ్ ఇన్‌స్పె‌క్టర్ల సంఖ్యను పెంచలేదన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త ల్యాబ్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.