IND vs ENG: తుది జట్టులో దక్కని చోటు..T20 లీగ్ ఆడేందుకు వెళ్తున్న ఇంగ్లాండ్ క్రికెటర్

ఇంగ్లాండ్ బ్యాటర్ డాన్ లారెన్స్‌ ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లాండ్ టెస్ట్ స్క్వాడ్ లో ఉన్న లారెన్స్  ILT20 సీజన్‌లో ఆడనున్నట్లు నిర్ణయించుకున్నాడు. UAEలో జరుగుతున్న ILT20 సీజన్‌లో తమ తదుపరి రెండు మ్యాచ్‌లలో డెసర్ట్ వైపర్స్ ఫ్రాంచైజీ తరపున ఆడేందుకు డాన్ లారెన్స్‌కు ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ అనుమతి ఇచ్చింది. లారెన్స్ ఈ సీజన్‌లో వైపర్స్‌ తరపున మొదటి వైల్డ్‌కార్డ్ ఎంపికగా నిలిచాడు.

భారత్, ఇంగ్లాండ్ జట్టు మూడో టెస్ట్ ఆడేందుకు వారం సమయం ఉంది. ఈ గ్యాప్ లో లారెన్స్ రెండు మ్యాచ్ లు ఆడనున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ దుబాయ్ లోనే ఉంది. ILT20 లీగ్ కూడా ఇక్కడే జరగడంతో ఫిబ్రవరి 9న దుబాయ్ క్యాపిటల్స్‌తో, 11న షార్జా వారియర్స్‌తో లారెన్స్ మ్యాచ్ లు ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 12 వరకు ఇంగ్లాండ్ ఇక్కడే విరామం తీసుకుంటుంది. 13న ఇంగ్లాండ్ జట్టుతో కలిసి లారెన్స్ రాజ్ కోట్ బయలుదేరుతాడు. వైపర్స్‌ జట్టు తరపున లారెన్స్ ఆడేందుకు పర్మిషన్ ఇచ్చిన ఇంగ్లాండ్ యాజమాన్యానికి ఫ్రాంచైజీ కృతజ్ఞతలు తెలియజేశారు.

హ్యారీ బ్రూక్ వ్యక్తిగత కారణాలతో భారత్ తో సిరీస్ నుండి తప్పుకోవడంతో లారెన్స్ కు ఇంగ్లాండ్ టెస్ట్ స్క్వాడ్ లో అవకాశం వచ్చింది. తొలి రెండు టెస్టుల్లో తుది జట్టులో ఆడేందుకు అవకాశం రాలేదు. వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో జట్టులో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే లారెన్స్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లారెన్స్ కు తుది జట్టులో స్థానం దక్కాలంటే వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ బెంచ్ కు పరిమితం కావాల్సిందే. 5 టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 తో సమంగా నిలిచాయి.