- దళారిని అరెస్ట్ చేసిన మంచిర్యాల జిల్లా పోలీసులు
దండేపల్లి, వెలుగు: తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేసిన ఒకరిని మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపిన ప్రకారం.. మండలంలోని కొత్త మామిడిపల్లికి చెందిన దళారి ఎంబడి సురేందర్ ఈనెల 2న గ్రామానికి చెందిన కొందరు రైతుల వద్ద తక్కువ ధరకు సన్న వడ్లను కొనుగోలు చేశాడు. మామిడిపల్లి గ్రామ ప్రత్యేక అధికారి అయిన తహసీల్దార్ సంధ్యారాణి సంతకం ఫోర్జరీ చేసి వడ్లను జమ్మికుంట రైస్ మిల్లుకు తరలిస్తున్నాడు.
సమాచారం అందడంతో భూమన్నగూడెం వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్టు వద్ద ఆర్ఐ లారీని ఆపి చెక్ చేశాడు. సుమారు 250 వడ్ల బస్తాలు ఉండగా వాటికి సంబంధించిన పత్రాలను చూపించగా తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్టు తేలింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆర్ఐ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి నిందితుడు సురేందర్ ను గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు ఎస్ ఐ తెలిపారు.