డిండి ప్రాజెక్ట్​కు నీళ్లెట్ల?

డిండి ప్రాజెక్ట్​కు నీళ్లెట్ల?
  • ఎనిమిది సర్వేలు చేసినా ఎటూ తేల్చలే​
  • నీరొచ్చే దారి తేల్చకుండానే కట్టిన రిజర్వాయర్లు  
  • మెయిన్​ సోర్స్​ గుర్తించకుండానే
  • రూ.1,000 కోట్లు ఖర్చు గత బీఆర్ఎస్ పాలకుల​ 
  • నిర్వాకంతో ఇంజనీర్లు పరేషాన్ ప్రాజెక్ట్ పూర్తికి  కాంగ్రెస్ ప్రభుత్వం  ఫోకస్

నాగర్​కర్నూల్, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు నీరందించే డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్ ను ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. రెండు నియోజకవర్గాల్లో 3.68 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు రూ.6,300 కోట్ల అంచనాలతో  2015లో అప్పటి బీఆర్ఎస్​ సర్కార్ ప్రాజెక్ట్​ను చేపట్టింది. దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసి 8 సార్లు సర్వేలు చేయించినా.. ప్రాజెక్ట్ కు ఎక్కడి నుంచి నీరు ఇవ్వాలనే దానిపై ఎటూ తేల్చలేదు. 

చివరి సర్వేలో మాత్రం వట్టెం రిజర్వాయర్​నుంచి నీరు తరలిస్తే సరిపోతుందని చెప్పి చేతులు దులిపేసుకుంది. ఇలా సర్వేలకు పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసినట్లైంది. కాగా.. పాలమూరు-– రంగారెడ్డి  ప్రాజెక్ట్​లోని నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లలో ఏదో ఒక దాని నుంచి డిండి మెయిన్​ కెనాల్​ను లింక్​చేసి నీరివ్వాలని నిర్ణయించినా, పాలమూరు ప్రాజెక్ట్​ నీటి కేటాయింపులు ఒక టీఎంసీకే పరిమితం కావడంతో  పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఇప్పటి వరకు డిండి ప్రాజెక్ట్​కు నీటిని తరలించే మెయిన్​ సోర్స్​ గుర్తించకుండానే రూ.1,000 కోట్లు ఖర్చు చేశారు. 

మంత్రుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక..

కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిండి ప్రాజెక్ట్​పై రివ్యూ నిర్వహించిన ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్ ​కుమార్​రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి డీపీఆర్​ను​పరిశీలించారు. ఇంత భారీ ప్రాజెక్ట్​కు ఎక్కడి నుంచి నీరు ఇవ్వాలో తేల్చకుండా రిజర్వాయర్లు, కాల్వలు కట్టడంతో ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. మంత్రులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ పనులు పర్యవేక్షిస్తున్న ఇంజనీర్లు తలలు పట్టుకుంటున్నారు. 

వట్టెం రిజర్వాయర్​9వ ప్యాకేజిలోని మూడో కిలోమీటర్​వద్ద (పోతిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో) రోజూ సగం టీఎంసీ తరలించేలా రెండు తూములు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది కాకపోతే ఏదుల రిజర్వాయర్ ​నుంచి ప్రధాన కాల్వను తవ్వి డిండి వాగు ప్రవాహంలో కలిపేలా ప్లాన్​చేశారు. ఇది కూడా వర్క్​అవుట్ ​కాకుంటే నార్లాపూర్ ​నుంచి పైప్​లైన్​ద్వారా ఉల్పర వరకు నీటిని తరలించాలని లెక్క లేసుకున్నారు. డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టులో ఏడు ప్యాకేజీలకు గాను శివన్నగూడెం, కిష్టంపల్లి రిజర్వాయర్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. నాగర్​కర్నూల్​జిల్లా వంగూరు మండలంలో భూములు కోల్పోయిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.25 కోట్లు ఈ మధ్యనే కలెక్టర్ అకౌంట్​కు బదిలీ చేశారు.

గత సర్కారు అనాలోచిత నిర్ణయాలు 

శ్రీశైలం నుంచి రోజుకు సగం టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు వరద జలాలను దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తరలించి స్థానిక తాగునీటి అవసరాలకు, 3.68 లక్షల ఆయకట్టుకు సాగు నీరందించేం దుకు ప్రాజెక్ట్​ను గత బీఆర్ఎస్​ సర్కార్ ​చేపట్టింది. డిండి లిఫ్ట్​ స్కీమ్ కింద నాగర్​కర్నూల్​జిల్లాలో ఐదు మండలాలకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకు రెండు చోట్ల పంప్​చేసి, రెండు ఆఫ్ ​లైన్, మూడు ఆన్​లైన్​రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కాల్వలు, రిజర్వాయర్ల పనులు ప్రారంభించిన తర్వాత ఎక్కడి నుంచి నీరివ్వాలనే దానిపై రిటైర్డ్​ ఇంజనీర్​కు చెందిన ఓ ప్రైవేట్​ కన్సల్టెన్సీ ఏజెన్సీతో సర్వేలు నిర్వహించినా ఏం తేల్చలేకపోయారు. 9 ఏండ్లుగా ఎక్కడికక్కడే పనులు నిలిచిపోయాయి.

రూ. 100 కోట్లతో తూములు నిర్మించి..

డీఎల్ఐకి నార్లాపూర్​నుంచి వచ్చే టన్నెల్​జంక్షన్​నుంచి కాకుండా ఏదుల రిజర్వాయర్​నుంచి నీరు తరలించాలని ప్రతిపాదించారు. భూసేకరణ, అండర్​టన్నెల్​నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని వట్టెం రిజర్వాయర్ నుంచి నీరందించాలని ప్రతిపాదించారు. వట్టెం 9వ ప్యాకెజీలోని మూడో కిలోమీటర్​వద్ద నిర్మించిన కట్టను తొలగించి దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో తూములు నిర్మించారు. 

కేఎల్ఐ కాల్వల ద్వారా నీటిని డిండి వాగులోకి వదిలి ఉల్పర వద్ద 600 ఎకరాల్లో నిర్మించే రిజర్వాయర్​లోకి తరలించాలని ప్రతిపాదించారు. చివరికి ఉల్పర రిజర్వాయర్ ను కూడా ఎత్తేశారు. డిండి లిఫ్ట్​ఇరిగేషన్​ప్రాజెక్ట్​ పనులపై ప్రభుత్వం సీరియస్​గా ఉండగా.. రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణంతో పాటు నీటిని తరలించే ప్రధాన సమస్యను అధిగమించేందుకు కసరత్తు చేస్తోంది.