నారాయణపేట: అంతరించిపోతున్న బుర్ర వీణ కళకు జీవితాన్ని అంకితం చేసి, ఆ కళ పరిరక్షణకు కృషి చేస్తున్న నారాయణ పేట జిల్లా, దామర్ గిద్ద మండల కేంద్రానికి చెందిన దాసరి కొండప్పను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రకటించడం పట్ల సామాజిక కార్యకర్త, మాజీ సర్పంచ్ గవినోళ్ల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బుర్ర వీణ కళలో ప్రావీణ్యం ఉన్న కళాకారుడు దాసరి కొండప్ప ఒక్కరే ఉన్నారని, ఈ కళను బతికించడం కోసం ఆయన విశేష కృషి చేస్తున్నారని అభినందించారు.
బుర్ర వీణ కళాకారుల్లో చివరి వాడైన కొండప్ప పేదరికంలో మగ్గుతున్నారని, ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొండప్పను ఆదుకుంటే ఆ కళను మరికొంతమందికి అందించే అవకాశం కూడా ఉందన్నారు. గతంలో అచ్చంపేటకు చెందిన కిన్నెర మొగిలయ్యకు కూడా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించిందన్నారు.
అప్పటి కేసీఆర్ సర్కారు కూడా మొగిలియ్య ప్రతిభను గుర్తించి రూ. కోటి బహుమతిగా అందజేసి ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం దాసరి కొండప్పను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొండప్పకు కూడా ప్రభుత్వం తరఫున రూ. కోటి అందజేసి ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి గవినోళ్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.