కేసీఆర్ కీలక నిర్ణయం.. BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్

కేసీఆర్ కీలక నిర్ణయం.. BRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఆదివారం (మార్చి 9) అధికారికంగా దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. నామినేషన్ దాఖలు చేసేందుకు సోమవారమే లాస్ట్ డేట్ కావడంతో ఒకరోజు ముందే కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు. సోమవారం (మార్చి 10) దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎ని ఆదేశించారు కేసీఆర్. బీఆర్ఎస్ కంటే ముందే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను అనౌన్స్ చేసింది. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‎లను కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేసింది. నామినేషన్ దాఖలు చేయడానికి రేపు ఒక్కరోజే గడువు ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేయననున్నారు. 


కేసీఆర్ సైలెంట్ ప్లాన్..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ సైలెంట్ స్ట్రాటజీ ప్లే చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక రేసులో దాసోజు శ్రవణ్ పేరు మొదటి నుంచి ఎక్కడ వినబడలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా అతడిని ఎమ్మెల్సీ రేసులోకి పరిగణలోకి తీసుకున్నట్లు ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు పదవి కాలం ముగుస్తోన్న వారిలోనే మళ్లీ ఒకరికి కేసీఆర్ ఛాన్స్ ఇస్తారని గులాబీ వర్గాల్లో ప్రచారం జరిగింది. 

కానీ కేసీఆర్ అనూహ్యంగా దాసోజు శ్రవణ్‎ను తెరమీదకు తీసుకొచ్చారు. మండలిలో బీఆర్ఎస్ తరుఫున దాసోజు శ్రవణ్ పార్టీ వాయిస్ ‎ను బలంగా వినిపిస్తాడనే నమ్మకంతోనే కేసీఆర్ అతడికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థి ఎంపిక విషయంలో గులాబీ బాస్ ఆచితూచీ వ్యవహరించారని టాక్. అందుకే ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో దాసోజు శ్రవణ్ పేరు చివరి వరకు లీక్ కాకుండా చూసినట్లు సమాచారం. 

కాగా, 2025 మార్చి 29తో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఐదు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 1 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా.. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలోని ఎమ్మెల్యేల బలాబలాల ప్రకారం.. అధికార కాంగ్రెస్ పార్టీకి 4 సీట్లు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 1 స్థానం దక్కనుంది. ఒక్క ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.