
- రెండేండ్లుగా కిరాయి లేదు
- ఖాళీ చేయని దుకాణాదారులు
- గోడలకు రంధ్రాలు చేస్తున్న డీసీసీబీ అధికారులు
- పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
వనపర్తి, వెలుగు: వనపర్తి డిస్ర్టిక్ట్ కో -ఆపరేటివ్సెంట్రల్బ్యాంక్ బ్రాంచ్ బిల్డింగ్ లోని షాపింగ్కాంప్లెక్స్వ్యవహారం వివాదాస్పదమవుతోంది. డీసీసీబీ భవనంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడమే రూల్స్‌కి విరుద్ధంగా కాంప్లెక్స్ కట్టి, ఏండ్లుగా కిరాయి వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆందోళనలు చేశారు. దీనిపై స్పందించిన డీసీసీబీ అధికారులు షాపింగ్కాంప్లెక్స్లోని దుకాణాదారులకు వెంటనే ఖాళీ చేయాలంటూ నోటీసులిచ్చారు. దుకాణాదారులు ఖాళీ చేయకపోతుండడంతో పాటు రెండేండ్లుగా అద్దె కూడా చెల్లించడంలేదు.
కొద్దిరోజుల కింద డీసీసీబీ ఆఫీసర్లు దుకాణాలకు కరెంటు కట్ చేయగా.. కోర్టు ఆర్డర్ తెచ్చుకుని పునరుద్ధరించుకున్నారు. ఎంతకూ షాపులను ఖాళీ చేయకపోవడంతో దుకాణాల ముందు పెద్ద మట్టి కుప్పలను పోశారు. షాపుల వెనుక భాగంలోని గోడలకు రంధ్రాలు చేశారు. దీంతో ఆందోళన చెందిన దుకాణాదారులు డీసీసీబీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కమర్షియల్ అనేదే ఉండరాదు
డీసీసీబీ భవనంలో ఎలాంటి కమర్షియల్ నిర్మాణాలు చేయరాదని కో- ఆపరేటివ్ అధికారులు చెబుతున్నారు. కానీ వనపర్తి బ్రాంచ్ భవనంలో 20ఏండ్ల కింద షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మించారు. పది షాపుల కిరాయిని డీసీసీబీ బ్యాంకులో జమచేయకుండా కొందరు విండో ప్రతినిధులు తమ సొంత ఖాతాల్లో కిరాయి వేయించుకున్నారు. దీనిపై బీజేపీ నేతలు ప్రశ్నించినప్పుడు అభివృద్ధి కోసమే వేయించుకున్నామని చెప్పారు. డీసీసీబీ బిల్డింగ్ లో షాపిం గ్ కాంప్లెక్స్ కాకుండా బ్యాంకుకు వచ్చే రైతుల కోసం విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా అలాంటివేవీ అక్కడ లేకపోవడం గమనార్హం.