గెలుపుపై అతి విశ్వాసం వద్దు .. అందరూ సమన్వయంతో ప్రచారం చేయాలి: దీపాదాస్ మున్షీ

గెలుపుపై అతి విశ్వాసం వద్దు .. అందరూ సమన్వయంతో ప్రచారం చేయాలి: దీపాదాస్ మున్షీ

నాగర్ కర్నూల్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఏఐసీసీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలకు చేరాలి. ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ సీటు గెలిచే జాబితాలో ఉంది. గెలుస్తున్నామనే అతి విశ్వాసం వద్దు. ప్రచారంలో సమన్వయం అవసరం. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు ప్రచార బాధ్యతలు తీసుకొని ప్రచారంలో వేగం పెంచాలి. 

కార్నర్ మీటింగ్‌‌‌‌లు, మెజార్టీ ప్రజలను కలిసేలా ప్రచారం జరగాలి’’అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి దీపాదాస్ మున్షీ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ సెక్రటరీ విష్ణుకాంత్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్​ కుమార్, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బుధవారం ఆమె జిల్లా కేంద్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​రెడ్డి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, మేఘారెడ్డి, గద్వాల జడ్పీ చైర్ పర్సన్​సరిత, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ జగదీశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.