
- డిగ్రీ అర్హతతో..బిందాస్ బ్యాంక్ జాబ్
బ్యాంక్ కొలువే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పీవో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎంపికైన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్‌గా చేరి చైర్మన్ వరకు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. మూడంచెల ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఎలా సక్సెస్ అవ్వాలో ఈ వారం తెలుసుకుందాం...
డిగ్రీ పూర్తయి బ్యాంకింగ్ రంగంలో ఉన్నతంగా స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఎస్‌బీఐ పీవో నోటిఫికేషన్ మంచి అవకాశం. ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే సాలరీ, అలవెన్స్‌లు, ప్రమోషన్స్ బాగా ఉండడంతో ఎస్‌బీఐ పీవోకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌ల్లో సెక్షన్ల వారీ కటాఫ్ మార్కుల రూల్ లేకపోవడం ఈసారి అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్:
ఇది ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నపత్రాన్ని గంటలో పూర్తిచేయాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికీ 20 నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. కేటగిరీలవారీగా ఖాళీలకు పది రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. సుమారు 20,560 మంది మెయిన్స్ రాస్తారు.
మెయిన్స్:
200 మార్కులకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. రెండూ ఆన్‌లైన్‌లోనే రాయాలి. ఆబ్జెక్టివ్ పరీక్షకు 3 గంటల సమయాన్ని కేటాయించారు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్‌లో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 ప్రశ్నలు 60 మార్కులు. డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 35 ప్రశ్నలు 60 మార్కులు. జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 35 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు 30 నిమిషాలు ఉంటుంది. పరీక్షలో ఇంగ్లిష్‌లో లెటర్, ఎస్సే రాయాలి. ఖాళీలకు 3 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మొత్తం 6,168 మంది ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ (జీడీ)లో పాల్గొననున్నారు.
ఇంటర్వ్యూ:
ఫైనల్ స్టేజ్ ఎగ్జామ్‌కు 50 మార్కులు కేటాయించారు. ఇందులో 20 మార్కులు గ్రూప్ డిస్కషన్‌కు, 30 మార్కులు ఇంటర్వ్యూకు ఉంటాయి. కరోనా నేపథ్యంలో 50 మార్కులకు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు శాతం మార్కులు తగ్గిస్తారు.
ఫైనల్ సెలెక్షన్:
మెయిన్స్, ఇంటర్వ్యూలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మెయిన్స్ 250 మార్కులను 75 మార్కులకు, ఇంటర్వ్యూలోని 50 మార్కులను 25కి కుదిస్తారు. 100 మార్కులను స్కేల్‌గా తీసుకొని, మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు.
ఎంపికైతే..
ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల పీఓ బేసిక్ సాలరీ రూ.36,000గా ఉంది. కానీ ఎస్‌బీఐకి ఎంపికైనవారు అదనంగా 4 ఇంక్రిమెంట్లు పొందుతారు. దాంతో బేసిక్ రూ.41,960తో మొదలవుతుంది. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. మూడేళ్లు విధుల్లో కొనసాగడం తప్పనిసరి. ఉద్యోగంలో చేరినప్పుడే రూ.2 లక్షలకు అగ్రిమెంట్ సమర్పించాలి.
– వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్
నోటిఫికేషన్
ఖాళీలు: 2056, విభాగాల వారీగా పోస్టులు: ఎస్సీ 324, ఎస్టీ 162, ఓబీసీ 560, ఈడబ్ల్యుఎస్ 200, జనరల్ 810, అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, వయసు: 1 ఏప్రిల్ 2021 నాటికి 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి, చివరి తేదీ: 25 అక్టోబర్, ప్రిలిమ్స్: నవంబరు/ డిసెంబరులో
మెయిన్స్: డిసెంబర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్: ఫిబ్రవరి 2022, అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈబీసీలు రూ.750. తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. వెబ్‌సైట్: www.sbi.co.in
ప్రిపరేషన్ ప్లాన్: ప్రిలిమ్స్, మెయిన్స్‌కు కలిపి ఉమ్మడిగా ప్రిపేర్ అవ్వాలి. రెండింట్లో ప్రధానంగా నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. జనరల్/ ఫైనాన్స్ అవేర్‌నెస్ మినహా మిగిలిన మూడు సబ్జెక్టులు ప్రిలిమ్స్, మెయిన్స్‌లో వెయిటేజీ ఎక్కువ ఉంటుంది. ఈ నాలుగు సబ్జెక్టులను ప్రిలిమ్స్ సమయంలోనే మెయిన్స్ స్థాయిలో ప్రాక్టీస్ పూర్తి చేయాలి. ప్రిలిమ్స్ నవంబర్ చివరి వారంలో, మెయిన్స్ డిసెంబర్ చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థులు ముందుగా సబ్జెక్ట్‌లోని అన్ని టాపిక్స్ బేసిక్స్ చదవాలి. కాన్సెప్ట్ పూర్తయ్యాక లోయర్ స్టాండర్డ్ నుంచి హై స్టాండర్డ్ ప్రశ్నలు ఎగ్జామ్ ఓరియెంటెడ్‌లో ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్‌కు ఉన్న 40 రోజుల సమయంలో 20 రోజుల్లో అన్ని టాపిక్స్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత సమయం రివిజన్‌కు, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్‌కు కేటాయించాలి. మోడల్ పేపర్స్ చేస్తుంటే టైమ్ మేనేజ్మెంట్ తెలుస్తుంది.
ప్రమోషన్స్: పదోన్నతులు ఎస్‌బీఐలో వేగంగా ఉంటాయి. ప్రొబేషనరీ సమయం పూర్తయ్యాక స్కేల్-1 స్థాయిలో అసిస్టెంట్ మేనేజర్‌గా మొదలై.. టాలెంట్ ఆధారంగా మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ వరకు చేరే అవకాశం ఉంటుంది.