
- కమిటీలు లేక ఆలయాల్లో పరిష్కారానికి నోచుకోని సమస్యలు
- రాష్ట్రంలో 546 కమిటీలకు.. వేసింది 114 మాత్రమే
- నోటిఫికేషన్ ఇచ్చినా, వెయింటింగ్‌లో 272
- కోర్టు స్టేతో ఆగినవి 47 కమిటీలు
- వేములవాడలో పన్నెండేండ్లుగా ఉత్సవ కమిటీలే
హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపంగా మారింది. ట్రస్టు బోర్డుల ఏర్పాటులో అలసత్వం ప్రదర్శిస్తుండటంతో కమిటీల నియామకంలో జాప్యం జరుగుతున్నది. దీంతో ఆలయాల్లో భక్తులకు సదుపాయాలు కల్పించడంతోపాటు సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రస్టు బోర్డులు లేకపోవడంతో ఆలయాల పాలనా వ్యవహారాల్లో పారదర్శకత లోపించిందన్న విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రంలోని 546 ఆలయాల ట్రస్టు బోర్డు కమిటీల పదవీకాలం పూర్తయి నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు 114 కమిటీలు మాత్రమే ఏర్పాటయ్యాయి. ఇంకా 432 కమిటీలు పెండింగ్ లో ఉన్నాయి. 47 కమిటీలు కోర్టు స్టేతో నిలిచిపోయాయి. అయితే, మెజార్టీ కమిటీలకు నోటిఫికేషన్ ఇచ్చినా, నియామక ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు.
56 ఆలయాల్లో రూ.కోటిపైగా ఆదాయం
రాష్ట్రవ్యాప్తంగా 546 ఆలయ ట్రస్టు బోర్డులు, రెనోవేషన్ కమిటీలు వేయాల్సి ఉంది. వీటిలో రూ.కోటిపైగా ఆదాయం వచ్చే ఆలయాలు 56 వరకూ ఉన్నాయి. ఇందులో 17 బోర్డులకు కమిటీల నియామకం పూర్తి కాగా, కోర్టు స్టేతో 5 కమిటీలు నిలిచిపోయాయి. పెండింగ్ లో 11 ఉండగా.. 2 ట్రస్టు బోర్డులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2 కమిటీలకు మినహాయింపు ఉంది. ఇక రూ.25 లక్షల నుంచి రూ. కోటిలోపు ఆదాయం ఉన్న ఆలయాలు ధార్మిక పరిషత్ పరిధిలో 118 ఉన్నాయి. ఇందులో15 ఆలయాల బోర్డులు కోర్టు స్టేతో నిలిచిపోగా 21 పెండింగ్ లో ఉన్నాయి.
22 కమిటీలను వేయగా, 3 కమిటీలకు మినహాయింపు ఇచ్చారు. రూ.2 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు కమిషనర్ పరిధిలో 372 ఆలయాలు ఉన్నాయి. ఇందులో 27 కమిటీలు కోర్టు స్టేతో నిలిచిపోయాయి. 65 కమిటీలు పెండింగ్ లో ఉండగా, 79 కమిటీలను పూర్తి చేశారు. మరో 5 కమిటీలకు మినహాయింపు ఇచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.
272 కమిటీల కోసం నిరీక్షణ
రాష్ట్రంలో ఉన్న 546 ఆలయాల ట్రస్టు బోర్డులలో 272 కమిటీలకు నోటిఫికేషన్ ఇచ్చారు. కమిటీల ప్రతిపాదనలు కూడా జరిగాయి. అక్కడి నుంచి వచ్చే రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. కానీ అందుకు సంబంధించిన సమాచారాన్ని త్వరగా తెప్పించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. వీటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో భక్తులకు సేవలందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రస్టు బోర్డు కమిటీల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
మంత్రి దృష్టిసారించేనా?
రాష్ట్రంలోని ఆలయాలకు ధర్మకర్తల మండలిని నియమిస్తామని ఆరు నెలల క్రితం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఇది కార్యరూపం దాల్చలేదు. ఆలయాల అభివృద్ధిపై మంత్రి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నా, ట్రస్టు బోర్డు కమిటీల ఏర్పాటును మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రి స్పందిస్తే తప్ప ట్రస్టు బోర్డు కమిటీల నియామకం ముందుకు సాగదని చెప్తున్నారు.
వేములవాడలో ఉత్సవ కమిటీలే..
రాష్ట్రంలో అతి పెద్ద ఆలయాల్లో వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం కూడా ఒకటి. మహాశివరాత్రి, శ్రీరామనవమి వేడుకలు, శివకల్యాణోత్సవాల వంటి వేడుకలు దేవాలయంలో ప్రధానంగా జరుగుతుంటాయి. దేవస్థానానికి తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ మహాశివరాత్రి సమయంలో మాత్రం ఉత్సవ కమిటీలను నియమించి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీలు నియమించినా, అధికారుల పెత్తనమే కొనసాగుతున్నది.
వేములవాడ దేవస్థానానికి 1963 నుంచి ట్రస్టు బోర్డు నియామకాలు జరుగుతున్నాయి. 2009-=2013 మధ్య మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న చైర్మన్‌గా కొనసాగిన తర్వాత పాలకవర్గాలను నియమించలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2016లో వేములవాడ దేవస్థానం అభివృద్ధి కోసం వీటీడీఏను ఏర్పాటు చేశారు. సీఎంను చైర్మన్‌గా, సీనియర్ ఐఏఎస్ అధికారిని వైస్ చైర్మన్‌గా నియమించినా, హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు కొనసాగించారు. గతేడాది నుంచి వీటీడీఏ కార్యకలాపాలను వేములవాడ నుంచి కొనసాగిస్తున్నారు.