న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు 'భారతరత్న' ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. చేంజ్.ఆర్గ్ అనే సంస్థకు చెందిన ఓ వ్యక్తి ఏప్రిల్ 7న రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ఎందుకు ఇవ్వాలో అనే అంశాలను కూడా పిటిషనర్ పేర్కొన్నారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఎన్నో విద్యాసంస్థలను టాటా గ్రూప్ నెలకొల్పిందని, సమాజ సేవలో టాటా సంస్థలు ఎనలేని కృషి చేస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. టాటా ట్రస్ట్ కరోనా సమయంలో రూ.1500 కోట్లకు పైగా ఖర్చు చేసి పేదలకు సాయం చేసిందన్నారు. దశాబ్దాలుగా వేల మందికి టాటా సంస్థలు ఉపాధి కల్పిస్తున్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అలాంటి సంస్థకు చైర్మన్ గా ఉండి... దేశానికి ఎంతో సేవ చేసిన రతన్ టాటాకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. కాగా.. చేంజ్.ఆర్గ్ తరపున మొత్తం 12 పిటిషన్లు రతన్ టాటా గురించి దాఖలు కాగా... రతన్ టాటాను భారత ప్రెసిడెంట్ గా నామినేట్ చేయాలని ఓ పిటిషనర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. టాటా గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు జేఆర్డీ టాటాకు 1992లో భారతరత్న అవార్డు వచ్చింది.
Delhi High Court today will hear a petition seeking 'Bharat Ratna' to industrialist Ratan Tata for his service to the nation.
— ANI (@ANI) March 31, 2022