దేవాదాయ శాఖలో ప్రమోషన్లు

  • గ్రేడ్ 3 ఈవోలుగా 33 మంది  జూనియర్ అసిస్టెంట్లు
  • 3 దశాబ్దాల నిరీక్షణకు తెర
  • మంత్రి సురేఖ చేతుల మీదుగా పదోన్నతి పత్రాల స్వీకరణ
  • అందరి సంక్షేమానికి  ప్రాధాన్యం: సురేఖ 

హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో 3 దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న  జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఈవోలుగా ప్రమోషన్లు  కల్పిస్తూ దేవాదాయ శాఖ జీవో జారీ చేసింది.  జీవో 134 ద్వారా మొత్తం 33 మంది జూనియర్  అసిస్టెంట్లకు ఈవోలుగా పదోన్నతి లభించింది. వీరికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం  ప్రమోషన్  పత్రాలను అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఈవోలు మంత్రిని సన్మానించారు. 

దసరా పండుగ ముందే వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్3 ఈవోలుగా ప్రమోషన్  కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వకుండా గత బీఆర్ఎస్  ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని, వారిని మానసికంగా వేధించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే ప్రమోషన్లు ఇచ్చుంటే  దేవాదాయ శాఖ మరింత బలోపేతమయ్యేదని, పెండింగ్  సమస్యలకు పరిష్కారం లభించేదని పేర్కొన్నారు. 

ఇప్పటికే గ్రేడ్–1, గ్రేడ్–2 ఈవోలుగా పలువురికి తమ ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించిందని గుర్తుచేశారు. ప్రజలు, ఉద్యోగుల సమస్యలను ప్రజా ప్రభుత్వం త్వరగా  పరిష్కరిస్తుందన్నారు. కొత్తగా పదోన్నతులు పొందిన ఈవోలు, ఉద్యోగులు ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై శ్రద్ధపెట్టాలని మంత్రి సూచించారు. దేవాదాయ శాఖ భూముల్లో సౌర విద్యుత్  ఉత్పత్తి,  భూములకు జియో ట్యాగింగ్​ తో దేవాదాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  

ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరిగింది

ప్రజా ప్రభుత్వంలో తమకు న్యాయం జరిగిందని దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం తమ ప్రమోషన్ల విషయంలో  తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని ఆయన వాపోయారు. సీఎం రేవంత్​రెడ్డి,  మంత్రి కొండా సురేఖ చొరవతో తమకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాలను త్వరగా అమలు చేసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ, కమిషనర్  హన్మంతరావుకు ధన్యవాదాలు తెలిపారు.