భట్టి కాన్వాయ్​కి ప్రమాదం

 భట్టి కాన్వాయ్​కి ప్రమాదం
  • చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఎస్కార్ట్​ వెహికల్
  • జనగామ జిల్లా పెంబర్తిలో  ఘటన

జనగామ, వెలుగు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాన్వాయ్​కి ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్​గా వెళ్లిన ఎస్సై, డ్రైవర్​ సేఫ్​గా బయటపడ్డారు. హైదరాబాద్​ నుంచి వరంగల్​ పర్యటనకు డిప్యూటీ సీఎం బయల్దేరగా జనగామ జిల్లా ప్రారంభం పెంబర్తి నుంచి ఎస్కార్ట్​గా స్థానిక ఎస్సై చెన్నకేశవులు తన వాహనంలో వెళ్లారు. పెంబర్తి శివారు దగ్గరలో ఎస్సై వాహనం వెనక వస్తున్న డిప్యూటీ సీఎం కాన్వాయ్​లోని ఓ వాహనం తగిలేటట్లు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ సాగర్.. ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నంలో బండిని ఎడమ వైపుకు తిప్పాడు.

 దీంతో అప్పటికే వాహనం వేగంగా ఉండడంతో అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. కిలోమీటర్​ హద్దురాయిని ఢీకొని ఆగిపోయింది. ఈ ఘటనలో ఎస్సైతో పాటు డ్రైవర్​ సాగర్​కు ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలియగానే టౌన్​ సీఐ దామోదర్​ రెడ్డి స్పాట్​కు చేరుకుని ఆరా తీశారు. ప్రమాదంపై భట్టి ఆరా తీసి ఎస్సై క్షేమ సమాచారం గురించి అడిగి తెలుసుకున్నారని సీఐ మీడియాకు తెలిపారు.