ఎస్సీ, ఎస్టీ యువతకు.. 3వేల కోట్లతో స్వయం ఉపాధి స్కీంలు

ఎస్సీ, ఎస్టీ యువతకు.. 3వేల కోట్లతో స్వయం ఉపాధి స్కీంలు
  • రెండు నెలల్లో అందించాలి: డిప్యూటీ సీఎం భట్టి 
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ప్రీ బడ్జెట్ మీటింగ్​లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సంక్షేమ శాఖలో పథకాల అమలుకు ఎన్ని నిధులైన ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సంక్షేమ శాఖల ప్రీబడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గత పదేండ్లు పాలించిన వారు ఎస్సీ, ఎస్టీ యువతకు స్వంయం ఉపాధి పథకాలు పూర్తిగా పక్కన పెట్టారన్నారు. 

రూ.3 వేల కోట్ల బడ్జెట్ తో ఎస్సీ, ఎస్టీ యువతకు రెండు నెలల వ్యవధిలో స్వయం ఉపాధి పథకాలు అందించాలని డిప్యూటీ సీఎం అధికారులను కోరారు. ఈ భారీ ఉపాధి పథకాలకు సంబంధించిన ప్రణాళికలను వెంటనే సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులు అందరిని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలకు సంబంధించి అద్దెలు, డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్​ చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో పర్యటన కార్యక్రమం నిరంతరం కొనసాగేలా సంక్షేమ శాఖ అధికారులు ఫాలో అప్ చేసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి నిధులు రాబట్టడంలో వేగం పెంచాలని కోరారు.

ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు అటవీ హక్కుల చట్టం కింద లక్షలాది మంది గిరిజనులకు భూ పంపిణీ జరిగిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ భూముల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు విద్యుత్తు, వ్యవసాయ, అటవీ, ఉద్యాన శాఖ అధికారులతో సంయుక్తంగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాలకు రిపేర్లు చేపట్టి ఆ వర్గాల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఎస్టీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, కృష్ణ భాస్కర్, హరిత, పాటిల్ పాల్గొన్నారు.