రైతు భరోసా పడిందా.. జీరో బిల్లు వచ్చిందా .. ప్రజలను ఆరా తీసిన డిప్యూటీ సీఎం భట్టి

రైతు భరోసా పడిందా..  జీరో బిల్లు వచ్చిందా .. ప్రజలను ఆరా తీసిన డిప్యూటీ సీఎం భట్టి

ఎర్రుపాలెం, వెలుగు : ‘అయ్యా.. అందరికీ రైతు భరోసా పడిందా.. అమ్మా.. కరెంట్​ జీరో బిల్లులు వస్తున్నాయా?’  అంటూ ప్రభుత్వ పథకాల అమలుపై లబ్ధిదారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరా తీశారు. ఆదివారం మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం కాచవరం  గ్రామంలో ఆయన పర్యటించారు. ఉగాది పండుగ సందర్భంగా  గ్రామంలోని పార్వతి సమేత అమృత లింగేశ్వరస్వామి వారి ఆలయంలో  శివుడికి పూజలు చేశారు. అనంతరం ఆరు గ్యారంటీలపై గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామంలో 200 వరకు కుటుంబాలు ఉన్నాయని, అందులో దాదాపు 180 కుటుంబాలు జీరో బిల్లు ద్వారా లబ్ధి పొందుతున్నామని గ్రామస్తులు తెలిపారు.

 గ్రామానికి సంబంధించి జీరో బిల్లులు, వ్యవసాయ కనెక్షన్లకు అందిస్తున్న ఉచిత కరెంటుకు రూ.31లక్షలు  ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించిందని  ఏఈ అనూష వివరించారు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతులందరికీ రైతు భరోసా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయని పలువురు రైతులు తెలిపారు. 90 కుటుంబాలకు వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు వచ్చాయని చెప్పారు. గ్రామంలో రేషన్ షాపు లేనందున నరసింహపురం గ్రామానికి వెళ్లి తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందని, గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా లేదని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. కొంతమంది మహిళలు తమకు ఇండ్లు లేవని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని కోరారు.

 అనంతరం కొత్తగోపవరంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇందిరమ్మ డెయిరీ, రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు యువత అప్లై చేసుకోవాలని సూచించారు. సుబాబుల్ చెట్లతో కరెంట్ సరఫరాకు అంతరాయం జరుగుతోందని గ్రామస్తుల ఆయన దృష్టికి తేగా, సమస్య పరిష్కారానికి రూ 1.20 లక్షలతో ఎస్టిమేషన్ వేసి లైన్లు నిర్మించాలని వెంటనే డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి అయ్యిందని, అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకరరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నేతలు అయ్యిలూరి వెంకటేశ్వరరెడ్డి, చావా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.