- అమెరికన్ పారిశ్రామికవేత్తలకు డిప్యూటీ సీఎం భట్టి ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అమెరికన్ వ్యాపారవేత్తలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. లాస్ వేగాస్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ మైన్ ఎక్స్‌పోకు హాజరయ్యేందుకు వెళ్లిన భట్టి.. బుధవారం ఎక్స్‌పో అనంతరం అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమని, ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పిస్తామని భట్టి వారికి వివరించారు. రాష్ట్ర భూగర్భంలో దాగిన విలువైన ఖనిజాలను వెలికితీయడానికి పరిశ్రమలు నెలకొల్పాలని వారిని ఆహ్వానించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫోర్త్ సిటీలో కూడా భాగస్వాములు కావాలని కోరారు. క్రిటికల్ మినరల్స్ అన్వేషణలో సింగరేణికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికన్ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న గ్లోబల్ మార్కెట్స్ సహాయ కార్యదర్శి అరుణ్ వెంకటరామన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాయన్నారు.