పదేండ్లు రాష్ట్రాన్ని ఆగంజేసి.. మాపై విమర్శలా?

  • బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ 
  • విద్యుత్ సంస్థల కొత్త ఉద్యోగులకు అపాయింట్ మెంట్ లెటర్లు అందజేత 
  • విద్యుత్ ఉద్యోగుల పెండింగ్ డీఏ రీలిజ్​

హైదరాబాద్, వెలుగు: గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి ప్రజలకు భ్రమలు కల్పించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలతో ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని ఫైర్ అయ్యారు. పదేండ్ల పాటు ఆర్థిక విధ్వసంతో రాష్ట్రాన్ని ఆగంజేసి, ఇప్పుడు తమపై విమ‌‌ర్శలు చేయ‌‌డం విడ్డూరంగా ఉంద‌‌న్నారు. నార్తర్న్​డిస్కంలో ఉద్యోగాలు పొందిన 92 మందికి, ట్రాన్స్​కోలో ఉద్యోగం పొందిన 20 మందికి శనివారం సెక్రటేరియెట్​వద్ద మంత్రి తుమ్మలతో కలిసి భట్టి అపాయింట్ మెంట్ లెటర్లు అందజేశారు.

 విద్యుత్ శాఖ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న డీఏను విడుదల చేశారు. ఈ సంద‌‌ర్భంగా భట్టి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల ఆశలు అడియాశలు చేశారన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ‘‘ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అమలు చేస్తున్నాం. ఆరు గ్యారంటీలపై విమర్శలు చేసేటోళ్లు ఒక్కసారి బస్సెక్కి చూస్తే అది తెలుస్తుంది” అని అన్నారు. 

‘‘వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తాం. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. ఇందుకోసం రూ.8,400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం. ఈ నెల 26 తర్వాత మొదటి విడత ఇన్​స్టాల్మెంట్ డబ్బులు నేరుగా ల‌‌బ్ధిదారుల‌‌ ఖాతాల్లో జమ చేస్తాం” అని వెల్లడించారు. 

26 గ్రామాల్లో సోలార్ పవర్.. 

2035 నాటికి 40 వేల మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యంగా న్యూ ఎనర్జీ పాలసీ తెచ్చామని భట్టి తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు కింద 25 పల్లెలను సోలార్ గ్రామాలుగా మార్చనున్నట్టు చెప్పారు. ‘‘కరెంట్ సమస్యల పరిష్కారానికి అంబులెన్స్ త‌‌ర‌‌హాలో కరెంట్ అత్యవ‌‌స‌‌ర వాహ‌‌నాల‌‌ను ఏర్పాటు చేశాం. ఇందులో ఒక ట్రాన్స్‌‌ఫార్మర్‌‌, వైరు, ఇత‌‌ర ప‌‌రిక‌‌రాలు ఉంటాయి.

 1912 టోల్ ఫ్రీ నెంబ‌‌ర్‌‌కు కాల్ చేస్తే వ‌‌చ్చి కరెంటు స‌‌మ‌‌స్యను ప‌‌రిష్కరిస్తారు” అని పేర్కొన్నారు. రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్లారని చెప్పారు. ‘‘పోయినేడాది దావోస్‌‌లో ప‌‌ర్యటించి రాష్ట్రానికి రూ.46 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఈ పర్యట‌‌న‌‌లో రూ.ల‌‌క్ష కోట్లకు త‌‌గ్గకుండా పెట్టుబ‌‌డులు తేవాలనే లక్ష్యంతో దావోస్ వెళ్లారు” అని తెలిపారు.

విద్యుత్ ​ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గించండి

విద్యుత్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 నుంచి 60కి తగ్గించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఏఈఏ) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరింది. శనివారం టీఈఏఈఏ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్​ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్​ ప్రతినిధులు డిప్యూటీ సీఎంకు పలు వినతులు సమర్పించారు. 

ప్రతి ఆరేండ్లకు ఒకసారి టైం బౌండ్ లో ప్రమోషన్లు కల్పించాలని కోరారు. జెన్ కోలో ఇటీవల ప్రమోషన్లు పొందిన ఏడీలకు ఏడీఈలుగా పోస్టింగ్ ఇవ్వాలన్నారు. కింది స్థాయిలో ఉద్యోగులకు ఉన్నతస్థాయిలో పదోన్నతులు ఇచ్చే క్రమంలో డిపార్ట్​మెంటల్​ టెస్ట్​లు  నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో అసిస్టెంట్ ఇంజినీర్లు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని పరిష్కరించాలని విన్నవించారు. వారి వినతులకు భట్టి సానుకూలంగా స్పందించారు. 

ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించండి

ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నిటిని వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్ కోరారు. ఈ మేరకు శనివారం సెక్రటేరియెట్ లో డిప్యూటీ  సీఎంతో భేటీ అయ్యి  సమస్యలను ప్రస్తావించారు. 

ఆర్థిక భారం లేని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని భట్టిని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మంజూరు చేస్తున్నామని, పెండింగ్ సమస్యలను చర్చించడానికి వచ్చే నెల మొదటి వారంలో మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భట్టి హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలను కేబినెట్ సబ్ కమిటీ చర్చలకు పిలవాలని కోరగా ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని భట్టి పేర్కొన్నారు.