
- దేశంలోనే వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది: డిప్యూటీ సీఎం భట్టి
- వ్యవసాయ అభివృద్ధికి నాబార్డ్ సహకరించాలని విజ్ఞప్తి
- నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ విడుదల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.56 లక్షలుగా ఉన్నదని, దేశంలోనే వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.15.02 లక్షల కోట్లుగా, వృద్ధిరేటు 14.50 శాతంగా ఉందని తెలిపారు. 2025–26కు గాను రూ.3.85 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో రూపొందించిన నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ను శుక్రవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో మంత్రి తుమ్మలతో కలిసి భట్టి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి నాబార్డ్ మరింత సహకారం అందించాలని కోరారు.
తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పండుతున్నదని చెప్పారు. గత పదేండ్లలో రాష్ట్రంలో సైంటిఫిక్ సాగును నిర్లక్ష్యం చేశారని అన్నారు. గ్రీన్ హౌస్, పాలీ హౌస్, డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా పంటల సాగును ప్రోత్సహించాలని కోరారు. ‘‘నీటి కొరత ఉన్న జిల్లాల్లో డ్రిప్ ఇరిగేషన్ కు సహకరించాలి. హైదరాబాద్ పరిసరాల్లో గతంలో ఫ్లోరీ కల్చర్ ఎక్కువగా ఉండేది. పూల సాగును మళ్లీ ప్రోత్సహించాలి. ఐకేపీల ద్వారా ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలి. ఆయిల్ పామ్ సాగును బలోపేతం చేయాలి. మామిడి, పసుపు, మిర్చి నిల్వ కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయ స్థాయిలో రైతులకు శిక్షణ అందించాలి. గ్రీన్ పవర్ ఉత్పత్తికి సహకారం అందించాలి.
రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లను సోలార్ పంపుసెట్లుగా మార్చేందుకు కృషి చేయాలి” అని నాబార్డును కోరారు. గ్రీన్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఎదిగేందుకు సహకారం అందించాలన్నారు. మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు నాబార్డు ఆర్థిక చేయూత అందించాలని కోరారు.
పోడు భూముల్లో పామాయిల్, అవకాడో, వెదురు పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ క్రెడిట్ వ్యవస్థలను విస్తరించాలని సూచించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తే లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు.
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి: తుమ్మల
వ్యవసాయరంగ అభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమ రంగాలకు లోన్లు ఇవ్వాలన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ రీజినల్ సీజీఎం ఉదయ్ భాస్కర్, నాబార్డ్ ప్రతినిధులు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
బడ్జెట్లో రైతు భరోసాకు ప్రాధాన్యం
రాష్ట్రంలోని రైతులు, చేనేత కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో జరిగిన వ్యవసాయ, చేనేత, హస్త కళల శాఖల ఫ్రీ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి గత రాష్ట్ర బడ్జెట్లో పెద్ద మొత్తంలో కేటాయింపులు చేశామని.. ఈసారి కూడా ఆ విధానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
రైతు భరోసాకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపుపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సాధారణ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలతో వచ్చే ఆదాయం మూడు రెట్లు ఉంటుందన్నారు. జల వనరులను సంరక్షించడంతోపాటు పంట ఉత్పత్తులు పెరిగేందుకు ఉపయోగపడే డ్రిప్పు, స్పిన్క్ లర్లు సబ్సిడీపై రైతులకు అందజేయాలన్నారు. చేనేత కార్మికులకు సబ్సిడీపై నూలు, విద్యుత్ సౌకర్యం వంటి పథకాలు కొనసాగించాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో టెక్స్ టైల్ పార్కుల అభివృద్ధికి కావలసిన చర్యలు చేపట్టాలన్నారు.
సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్ హరిత, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.