కాళేశ్వరం బ్యారేజీల వద్ద టెస్టులను స్పీడప్ చేయండి

కాళేశ్వరం బ్యారేజీల వద్ద టెస్టులను  స్పీడప్ చేయండి
  • ఇరిగేషన్ శాఖకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ లేఖ
  • మీరు వివరాలు పంపించడం ఎంత లేటైతే.. రిపోర్ట్ అంత లేట్ అవుతుందని వెల్లడి
  • అడుగడుగునా నిర్లక్ష్యం చేశారని ఎన్డీఎస్ఏ చైర్మన్​కు ఇటీవల నిపుణుల కమిటీ లేఖ
  • ఎన్ని మీటింగ్​లు పెట్టినా ఇన్వెస్టిగేషన్స్ రిపోర్టులు ఇవ్వలేదని ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద చేయాల్సిన టెస్టులను వేగంగా నిర్వహించాలని, ఆ వివరాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీకి సమర్పించాలని ఇరిగేషన్ శాఖ కార్యదర్శికి ఎన్డీఎస్ఏ ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఎంత లేట్​గా ఇస్తే ఎన్డీఎస్ఏ తుది నివేదిక అంత లేట్ అయ్యే ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది. కనుక ఎన్డీఎస్ఏ సూచించిన ఇన్వెస్టిగేషన్స్​ను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని సూచించింది.

 ఈ మేరకు ఈ నెల 2న ఇరిగేషన్ సెక్రటరీకి ఎన్డీఎస్ఏ డైరెక్టర్ అజయ్ కుమార్ సిన్హా లేఖ రాశారు. దానికి అనుబంధంగా వివిధ బ్యారేజీల వద్ద పెండింగ్ ఉన్న టెస్టుల వివరాలపై ఎన్డీఎస్ఏ చైర్మన్​కు గత నెల 29న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రాసిన లేఖను జత చేశారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన ఆ టెస్టులన్నింటినీ త్వరగా పూర్తి చేసి వివరాలను సమర్పించాలని ఇరిగేషన్ శాఖకు స్పష్టం చేశారు.

అంతులేని నిర్లక్ష్యం

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద సిఫార్సు చేసిన టెస్టుల విషయంలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అడుగడుగునా నిర్లక్ష్యం చేసిందని ఎన్డీఎస్ఏ చైర్మన్​కు రాసిన లేఖలో నిపుణుల కమిటీ పేర్కొంది. గత నెల 29న ఎన్డీఎస్ఏ చైర్మన్​కు నిపుణుల కమిటీ మెంబర్ సెక్రటరీ ఈ లేఖ రాశారు. బ్యారేజీ కుంగాక.. ఈ ఏడాది మార్చి 2న ప్రమాద స్థలాన్ని పరిశీలించామని, బ్యారేజీల వద్ద తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలపై ఏప్రిల్ 30న పలు సిఫార్సులు చేశామని, అంతేగాకుండా ఆయా బ్యారేజీల వద్ద చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్​పైనా ఇరిగేషన్ అధికారులకు చెప్పామని ఆ లేఖలో పేర్కొన్నారు. 

అనంతరం మే1న బ్యారేజీలపై ఇంటెరిం మెజర్​మెంట్స్ సూచించామని వెల్లడించింది. అక్టోబర్ 31 వరకు అన్ని వివరాలను సమర్పిస్తామని ఇరిగేషన్​ శాఖ అధికారులు చెప్పడంతో.. కమిటీ గడువును డిసెంబర్​31 వరకు పొడిగించారన్నారు. అయితే, ఇప్పటివరకు డిపార్ట్​మెంట్ నుంచి ఆ ఇన్వెస్టిగేషన్స్​కు సంబంధించిన రిపోర్టులేవీ రాలేదని పేర్కొన్నారు. ‘‘అక్టోబర్​11న కమిటీ ఇంటర్నల్ రివ్యూ మీటింగ్ నిర్వహించాం. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి, అధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.

టెస్టులు చేయకపోవడంపై మీటింగ్​లో వివరించాం. అదే రోజు అక్టోబర్​ 11న ఇరిగేషన్ శాఖ కార్యదర్శికి లేఖ రాశాం. ఇరిగేషన్ శాఖ మంత్రి, అధికారులతో జరిపిన చర్చలపై అదే నెల 23న మరోసారి లేఖ ఇచ్చాం. ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్ వచ్చాక.. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేందుకు రెండు నెలల సమయం పడుతుందని స్పష్టం చేశాం. 

అయినా, ఇప్పటి వరకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నుంచి ఉలుకూపలుకూ లేదు. చేసిన కొన్ని టెస్టులపై నవంబర్ 28న రివ్యూ చేశాం. చేయాల్సిన టెస్టులు ఇంకా ఉన్నాయి. ఆ టెస్టులు త్వరితగతిన పూర్తి చేసేలా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కార్యదర్శి, అధికారులకు ఆదేశాలివ్వండి. ఇంకా ఆలస్యం చేస్తే ఫైనల్ రిపోర్ట్ మరింత ఆలస్యమవుతుంది’’ అని ఎన్డీఎస్ఏ చైర్మన్​కి రాసిన లేఖలో పేర్కొన్నారు.