యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటల సమయం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. సెలవురోజు కావడంతో దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2.30 నిమిషాల సమయం పడుతుంది. రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 

లడ్డూ ప్రసాదం కౌంటర్లు, నిత్య కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. లక్ష్మీ నరసింహ నామస్మరణతో యాదగిరి గుట్ట ప్రతిధ్వనిప్తోంది. భక్తులు అధికంగా రావడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.